Begin typing your search above and press return to search.

వెంక‌య్య మాట బ్ర‌హ్మ‌స్త్రంగా మారిందిగా!

By:  Tupaki Desk   |   18 Jun 2016 1:12 PM GMT
వెంక‌య్య మాట బ్ర‌హ్మ‌స్త్రంగా మారిందిగా!
X
పార్టీ మారే ఎమ్మెల్యేల‌తో త‌ల‌బొప్పి క‌ట్టిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హ‌రాల మంత్రి వెంక‌య్య‌నాయుడు అండ‌గా నిలిచారా? ఆయ‌న భ‌రోసాతోనే జ‌గ‌న్ పార్టీ చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని అధికార టీడీపీపై దూసుకుపోతుందా? ఈ సందేహం వినేందుకు కొత్త‌గా ఉందేమో కానీ జ‌రుగుతోంది అదేన‌ని అంటున్నారు.

ఫిరాయింపుల‌పై కొత్త చ‌ట్టాలు రావాల‌ని - క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేలా ఉండాల‌ని వెంక‌య్య‌నాయుడు వ్యాఖ్యానించి సంగ‌తి తెలిసిందే. ఈ కామెంటును అందిపుచ్చుకున్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన క‌రుణాక‌ర్‌ రెడ్డి టీడీపీపై చెల‌రేగిపోయారు. స్పీక‌ర్ ప‌రిధిలో చ‌ట్టాలు ఉండ‌డంతో ఫిరాయింపుల చ‌ట్టం దుర్వినియోగం అవుతుంద‌ని ఆయ‌న ఆరోపించారు. పార్టీ మారిన వారిపై చ‌ర్య‌లు తీసుకునే అధికారం ఇప్పించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వైఎస్ జ‌గ‌న్‌ దేశంలోని అనేకమంది జాతీయ రాజ‌కీయ నాయ‌కులను క‌లిసి చంద్ర‌బాబు ప్రోత్స‌హిస్తున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల‌పై, అవినీతిపై వివ‌రించార‌ని భూమ‌న తెలిపారు. ఫిరాయింపు చ‌ట్టంలో క‌ఠిన‌మైన సవరణలు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

పార్టీ గుర్తుల‌పై గెలిచిన ఎంపీటీసీల నుంచి ఎంపీల వ‌ర‌కు అందరికీ చట్టం వర్తించేలా ఆ అధికారం ఈసీ పరిధిలోకి తీసుకొచ్చేలా ఆర్డినెన్స్ తెచ్చి చట్ట సవరణ చేయాలని వైఎస్‌ జగన్ హోంమంత్రిని కోరడం జరిగిందన్నారు. స్పీక‌ర్ ప‌రిధిలో ఉన్న చ‌ట్టాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిధిలోకి తీసుకోచ్చే విధంగా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాల‌ని స్వ‌యంగా హోంమంత్రిని వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి కోరార‌ని భూమన తెలిపారు. చంద్ర‌బాబు ఇలాఖాలో చేస్తున్న అవినీతిపై బీజేపీ బాబును ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని భూమన ప్ర‌శ్నించారు. ఇత‌ర పార్టీల శాస‌న‌స‌భ్యుల‌ను విచ్చ‌లవిడిగా అనైతికంగా బాబు కొనుగోలు చేస్తున్నా, దారుణ‌మైన మోసాల‌కు పాల్ప‌డుతున్నా వెంక‌య్య‌నాయుడు ఎందుకు నిల‌దీయ‌డం లేదో చెప్పాలన్నారు.

అంద‌రి కుటుంబాలు చిన్న‌విగా ఉన్నాయి. జ‌నాభాను పెంచాల్సిన అవ‌శ్య‌క‌త ప్ర‌తిఒక్క‌రిపై ఉంద‌ని పేర్కొన్న బాబు వ్యాఖ్య‌లపైన భూమ‌న మండిప‌డ్డారు. క‌న్యాశుల్కం గిరీశం లాంటి వారు బాబు అని ఎద్దేవా చేశారు. గ‌తంలో పిల్ల‌ల‌ను క‌న‌డంలో అంద‌రూ నియంత్ర‌ణ పాటించాల‌ని చెప్పిన బాబు ఇప్పుడు మాట మార్చి పిల్ల‌ల‌ను ఎక్కువ‌గా క‌నాల‌ని చెప్ప‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సమ‌న్నారు. ఒక ప‌ద్ధ‌తి లేకుండా త‌న ఇష్టానుసారం వ్య‌వ‌హరిస్తున్న వ్య‌క్తి ఒక్క చంద్ర‌బాబ‌ేనన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లి... సాంఘిక భ‌ద్ర‌త క‌ల్పించి, సామాజిక స్థితిగ‌తుల‌ను మెరుగుప‌ర్చి, కుటుంబాల ఆర్థిక స్థితిని పెంచడం ద్వారా పౌష్టికత్వాన్ని మ‌రింతగా వృద్ధి చేయాల్సిన అభివృద్ధిని చూడ‌కుండా.... అంద‌రూ పిల్ల‌ల‌ను క‌నండ‌ని బాబు చెప్ప‌డం సిగ్గు చేట‌న్నారు.