Begin typing your search above and press return to search.

భూమా.. తప్పించి అందరూ మాట్లాడుతున్నారే

By:  Tupaki Desk   |   20 Feb 2016 1:21 PM GMT
భూమా.. తప్పించి అందరూ మాట్లాడుతున్నారే
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కిందామీదా పడుతోంది. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతారన్న కథనాలతో ఆ పార్టీ ఉలికిపాటుకు గురి కావటమే కాదు.. నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టటమే కాదు.. పార్టీ నుంచి వీడిపోయేందుకు రెఢీ అవుతున్న నేతలపై మైండ్ గేమ్ మొదలెట్టింది. చిత్రవిచిత్రమైన ఎత్తులతో ఆ పార్టీ చేస్తున్నహడావుడి పలువురికి ఆసక్తికరంగా మారింది.

తాజాగా కర్నూలు జిల్లా భూమానాగిరెడ్డి ఉదంతాన్నే తీసుకుందాం. ఆయన.. ఆయన కుమార్తెతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి సైకిల్ మీద స్వారీకి రెఢీ అన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. ఇందులో ఏమాత్రం నిజం లేదంటూ ఖండనలు మొదలయ్యాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. పార్టీ మారటం లేదంటూ భూమా నాగిరెడ్డి తప్పి పార్టీలోని మిగిలిన నేతలంతా గొంతు చించుకొని మరీ చెప్పటం విశేషం.

నిన్నటికి నిన్న (శుక్రవారం) మీడియాతో మాట్లాడిన భూమాను ఒక మీడియా ప్రతినిధి ఒక సూటిప్రశ్న వేశారు. మీరు హైదరాబాద్ వెళుతున్నారు కదా.. లోటస్ పాండ్ కి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన భూమా.. ‘‘స్టీరింగ్ నా చేతుల్లో లేదు. డ్రైవర్ చేతుల్లో ఉంది. అతడు ఎలా తీసుకెళితే అలా వెళతా’’ అంటూ వ్యాఖ్యానించారు. సూటిగా అడిగిన ప్రశ్నకు అంతే సూటిగా సమాధానం చెప్పే అలవాటున్న భూమా.. అందుకు భిన్నంగా ఇల చమత్కారంగా మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఆ తర్వాత నుంచి భూమా పార్టీ మారరన్న విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. భూమా బావమరిది ఇలా పలువురు మాట్లాడటం మొదలు పెట్టారు. భూమా పార్టీ నుంచి వెళ్లే ఛాన్స్ లేదని చెప్పటమే కాదు.. ఇదంతా మీడియా మాయగా కొట్టేస్తున్నారు. అంతేకాదు తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు హైదరాబాద్ లోని భూమా నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడి.. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. భూమా పార్టీ మారరని.. తమతోనే ఉంటారని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో తాము భూమాను కలవటానికి వచ్చామన్న జగన్ పార్టీ నేతలు మరో కామెడీ విషయాన్ని కూడా భలేగా చెప్పుకొచ్చారు. మీడియాలో వస్తున్న వార్తల్ని భూమా అస్సలు చూడటం లేదని.. తన కుమార్తె పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లుగా భూమా తమకు చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. పార్టీ నేతలు ఇంతమంది తన ఇంటికి వచ్చి.. పార్టీ మారే విషయాన్ని అడగటం.. దాన్ని ఆయన ఖండించటం లాంటివి జరిగి ఉంటే.. ఇంటికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో కలిసి పది అడుగులు బయటకు వేసి వచ్చి.. మీడియా ముందే తేల్చేయొచ్చుగా? కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న భూమాకు పార్టీ నేతలతో ఇంటి నుంచి బయటకు వచ్చి మాట్లాడేందుకు టైం లేదేమో..?