Begin typing your search above and press return to search.

కర్నూలు జిల్లాలో భూమా వర్సస్‌ ఎస్పీ

By:  Tupaki Desk   |   10 July 2015 9:26 AM GMT
కర్నూలు జిల్లాలో భూమా వర్సస్‌ ఎస్పీ
X
ఏపీలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే.. కర్నూలు జిల్లా కాస్తంత సమస్యాత్మకమైనది. ఇక్కడి రాజకీయ నాయకులతో అధికారులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే.. కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణకు.. నంద్యాల ఎమ్మెల్యే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన భూమానాగిరెడ్డికి మధ్య వివాదం రోజురోజుకి మరింతగా ముదురుతోంది.

అధికారపక్షానికి తొత్తుగా ఎస్పీ రవికృష్ణ వ్యవహరిస్తున్నారని భూమా ఆరోపిస్తున్నారు. ఎస్పీ రవికృష్ణ ట్రాక్‌ రికార్డు చూస్తే.. ఆయన పని చేసిన ఏ ప్రాంతంలోనూ వివాదాస్పద వైఖరి కానీ.. అవినీతి ఆరోపణలు కానీ అంటిన దాఖలాలు కనిపించవు. అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తారన్న విమర్శ కూడా కనిపించదు. కాస్తో..కూస్తో ప్రచారం మీద మోజెక్కువ అన్న చిన్నపాటి విమర్శ తప్పించి.. ఆయనపై మరెలాంటి విమర్శలు పెద్దగా వినిపించవు.

అయితే.. తనపై రెండుసార్లు కేసులు నమోదులో ఎస్పీ పాత్ర ఉందని.. ఆయన కావాలని తమను కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని రవికృష్ణపై ఎమ్మెల్యే భూమా ఆరోపిస్తున్నారు. దీనిపై సవాళ్లు విసరటం లాంటివి చేయటం.. తాజాగా దీనిపై ఎస్పీ రవికృష్ణ సైతం స్పందించటం గమనార్హం. తాను అవసరమైతే నంద్యాల్లో సైతం ఉంటానని.. బెదిరింపులకు లంగనని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.

నంద్యాలలో ఫ్యాక్షనిజాన్ని.. సంఘ వ్యతిరేక శక్తుల్ని అణిచి వేసేందుకు అవసరమైతే తాను నంద్యాల్లో కాపురం ఉంటానని.. ఫ్యాక్షనిస్టులకు సవాలు విసరటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కర్నూలు ఫ్యాక్షనిస్టులకు నేరుగా సవాలు విసిరిన రవికృష్ణ పట్ల కొందరు విమర్శలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం రవికృష్ణ ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. మొత్తానికి కర్నూలు ఎస్పీ వర్సెస్‌ భూమా అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న మాట మాత్రం బలంగా వినిపిస్తోంది.