Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు జైలు వాసం తప్పదా?

By:  Tupaki Desk   |   6 Jan 2021 5:47 PM IST
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు జైలు వాసం తప్పదా?
X
హైదరాబాద్ బోయినపల్లిలోని సీఎం కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసిన కేసులో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే కేసుకు సంబంధించి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉన్నారు. ఆయన సోదరుడు చంద్రబాబును ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిని మొదట అరెస్ట్ చేసిన పోలీసులు బోయినపల్లిలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి అఖిలప్రియను బేగంపేట్ లోని మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించి స్టేట్ మెంట్ రికార్డు చేశారు.అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు సికింద్రాబాద్ కోర్టులో నిందితులను ప్రవేశపెట్టేందుకు తీసుకెళుతున్నారు.

బోయినపల్లిలో కిడ్నాప్ కేసుకు సంబంధించి సీపీ అంజనీ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడారు. కిడ్నాప్ చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేశామని.. పూర్తి విచారణ చేస్తున్నామన్నారు. ఫిర్యాదు ఆధారంగా అనుమానితులను అరెస్ట్ చేశామన్నారు. కిడ్నాప్ కు గురైన ముగ్గురు వ్యక్తులను సేఫ్ గా రక్షించి తీసుకొచ్చామన్నారు.

నిన్న రాత్రి 11 గంటల సమయంలో సినీ ఫక్కీలో ప్రవీణ్ రావు ఇంటికి వచ్చిన కొందరు తాము ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. తర్వాత భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్ రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్ చేశారు. టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి కాపాడింది.

హాఫీజ్ పేటలోని 100 కోట్ల విలువైన భూమి కోసమే ఈ గొడవ జరిగిందని.. కిడ్నాప్ కు దారితీసిందని తెలుస్తోంది. ప్రస్తుతం కిడ్నాప్ అయిన ముగ్గురు క్షేమంగా ఇంటికి చేరారు. వెంటనే స్పందించిన తెలంగాణ పోలీసులకు ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.