Begin typing your search above and press return to search.

భూమా కుటుంబానికి షాక్ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   2 Feb 2019 10:50 AM GMT
భూమా కుటుంబానికి షాక్ త‌ప్ప‌దా?
X
ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ఆంధ్రప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు వేడెక్కాయి. టికెట్ల కోసం నేత‌ల వేట ముమ్మ‌ర‌మ‌వుతోంది. పార్టీల అధినేత‌ల చుట్టూ వారు ప్ర‌దక్షిణ‌లు చేస్తున్నారు. తాము కోరుకున్న - త‌మ‌కు ప‌ట్టున్న సీట్ల‌ను ద‌క్కించుకునేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. టీడీపీ - వైసీపీ - జ‌న‌సేన స‌హా అన్ని పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌పై తుది క‌స‌ర‌త్తులు జ‌రుపుతున్నాయి. చాలా స్థానాల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టికే పూర్తి చేశాయి.

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం అభ్య‌ర్థుల ఎంపిక పార్టీల‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఇద్దరు లేదా అంత‌కంటే ఎక్కువ‌మంది బ‌ల‌మైన నేత‌లు ఆయా టికెట్ల‌ను ఆశిస్తుండ‌టమే అందుకు కార‌ణం. ఒక్క‌రికే టికెట్ ఇచ్చి మిగిలిన వారిని పార్టీలు ఎలా బుజ్జ‌గిస్తాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలా నేత‌ల మ‌ధ్య పోటీ కార‌ణంగా రాష్ట్ర ప్ర‌జ‌ల దృష్టిని ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల కూడా ఉన్నాయి.

క‌ర్నూలు జిల్లాలోని ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి మంచి ప‌ట్టుంది. ప్రస్తుతం ఆళ్ల‌గ‌డ్డ నుంచి మంత్రి భూమా అఖిల‌ప్రియ‌, -నంద్యాల నుంచి అఖిల‌ప్రియ సోద‌రుడు భూమా బ్ర‌హ్మానంద రెడ్డి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక్ల‌లో వీరిద్ద‌రిలో ఒక‌రికి టీడీపీలో ఖో త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకు ప్ర‌ధాన కార‌ణంగా వినిపిస్తున్న పేరు ఎ.వి.సుబ్బారెడ్డి.

అఖిల‌ప్రియ‌తో విభేదాల ఫ‌లితంగా ఇటీవ‌ల సుబ్బారెడ్డి పేరు ప‌దేప‌దే వార్త‌ల్లోకెక్కింది. ఆయ‌న రాజ‌కీయ మైలేజీ కూడా పెరిగింది. ఆళ్ల‌గ‌డ్డ‌ - నంద్యాల ఎమ్మెల్యే టికెట్లు త‌న‌వేన‌ని సుబ్బారెడ్డి చెప్పుకుంటుడ‌టంపై టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు అఖిలప్రియ ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయ‌తీ పెట్టిన ఆయ‌న‌.. ఎవ‌రికి ఏ టికెట్ ఇచ్చే సంగ‌తి ఎన్నిక‌లొచ్చాకే తేలుస్తామ‌న్నారు.

ఎన్నిక‌లు స‌మీపించ‌డంతో సుబ్బారెడ్డి నోటి వెంట మ‌రోసారి టికెట్ల మాట వినిపిస్తోంది. నంద్యాల - ఆళ్లగడ్డ సీట్లలో ఏదో ఒకదాన్ని త‌న‌కు కేటాయించాల‌ని చంద్ర‌బాబుకు ఆయ‌న బ‌హిరంగ విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు. రెండింట్లో దేనికైనా స‌రే తాను పోటీకి సిద్ధ‌మంటున్నారు. ఈ నేప‌థ్యంలో నంద్యాల‌ - ఆళ్ల‌గ‌డ్డ‌ల్లో ఏదో ఒక సీటును సుబ్బారెడ్డికి చంద్ర‌బాబు కేటాయించ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌డ‌మంటే భూమా కుటుంబానికి - ముఖ్యంగా అఖిల‌ప్రియ‌కు షాకివ్వ‌డ‌మేన‌ని కూడా వారు విశ్లేషిస్తున్నారు. నంద్యాల‌ - ఆళ్ల‌గ‌డ్డ సీట్ల‌లో ఏది త‌మకు ద‌క్క‌క‌పోయినా భూమా కుటుంబం టీడీపీని వీడ‌టం ఖాయ‌మ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.