Begin typing your search above and press return to search.

నంద్యాల‌లో కొత్త లొల్లి మొద‌లైందే!

By:  Tupaki Desk   |   4 Sep 2017 5:16 AM GMT
నంద్యాల‌లో కొత్త లొల్లి మొద‌లైందే!
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అంటే... మొన్న‌టిదాకా ఎక్క‌డ లేనంత మేర ఆస‌క్తి క‌న‌బ‌డింది. ఎందుకంటే... నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ను అటు అధికార టీడీపీతో ఇటు విప‌క్ష వైసీపీ కూడా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకోవ‌డంతో యావ‌త్తు తెలుగు ప్ర‌జ‌లంతా ఆ ఎన్నిక‌పై అమితాస‌క్తిని క‌న‌బ‌రిచారు. ఇప్పుడు ఆ ఎన్నిక ముగిసిపోగా... అధికార పార్టీ ఆ స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. విప‌క్ష వైసీపీ శ‌క్తిమేర పోరాడ‌గా... గెలుపు కోసం అధికార పార్టీ అక్క‌డ మోహ‌రించిన బ‌ల‌గం, వెద‌జ‌ల్లిన తాయిలాల‌పై మొన్న‌టిదాకా పెద్ద చ‌ర్చే న‌డిచింది. ఇక ఇప్పుడు ఆ ఎన్నిక గురించి జ‌నమంతా క్ర‌మంగా మ‌రిచిపోతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు మ‌రో కొత్త లొల్లి స్టార్ట్ అయ్యింద‌న్న వార్త‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. అది కూడా అధికార పార్టీ టీడీపీలోనేన‌న్న విష‌యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింద‌నే చెప్పాలి.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఉప ఎన్నిక‌కు కొద్ది నెల‌ల ముందు దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి వైసీపీని మోసం చేసి టీడీపీలో చేరిపోవ‌డంతో అక్క‌డ అధికార పార్టీలో రెండు వ‌ర్గాల మ‌ధ్య వైరం తారాస్థాయికి చేరింది. అప్ప‌టిదాకా వేర్వేరు పార్టీల్లో ఉన్న భూమా - మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి వ‌ర్గాలు... ఆ త‌ర్వాత టీడీపీలోనే ఉండిపోవ‌డంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఒక‌రి కార్య‌క్ర‌మాల‌ను ఒక‌రు అడ్డుకునే దాకా వెళ్లడంతో ఆ రెండు వ‌ర్గాల మ‌ధ్య విభేదాల‌ను ప‌రిష్క‌రించేందుకు చంద్ర‌బాబుకు త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చింద‌న్న రీతిలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. ఒకే పార్టీలో ఉన్నా... భూమా - శిల్పాలు ప‌ర‌స్ప‌రం బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేసుకున్న తీరు నాడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచ‌ల‌నంగా మారిన వైనం కూడా మ‌న‌కు తెలిసిందే.

అయితే భూమా నాగిరెడ్డి గుండెపోటు కార‌ణంగా మ‌ర‌ణించ‌డంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ క్ర‌మంలో పార్టీ టికెట్ ఆశించిన శిల్పా మోహ‌న్ రెడ్డి... చంద్రబాబు నాన్చుడు వైఖ‌రితో విసిగిపోయి వైసీపీలో చేరిపోయారు. దీంతో అప్ప‌టిదాకా త‌న‌ను ఇబ్బందిపెట్టిన వ‌ర్గ పోరు త‌ప్పిపోయింద‌ని చంద్ర‌బాబు కూడా కాస్తంత హ్యాపీగానే ఫీల‌యిన‌ట్లు వార్త‌లు వినిపించాయి. ఇదిలా ఉంటే... నంద్యాల ఉప ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ... అక్క‌డ ఎలాగైనా విజ‌యం సాధించాల్సిందేన‌ని 12 మంది మంత్రులు - 50 మంది దాకా ఇత‌ర జిల్లాల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను అక్క‌డ మోహ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అక్క‌డి ఎన్నిక‌ల ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను క‌డ‌ప జిల్లాకు చెందిన జ‌మ్మల‌మ‌డుగు ఎమ్మెల్యేగానే కాకుండా చంద్ర‌బాబు కేబినెట్‌ లో కొత్త మంత్రిగా చేరిన చ‌దిపిరాళ్ల ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌న భుజాల‌పైకి ఎత్తుకున్నారు.

అయినా క‌డ‌ప జిల్లాకు చెందిన నేత‌కు నంద్యాల‌లో ఈ త‌ర‌హా బాధ్య‌త‌లు ఎలా సాధ్య‌మ‌న్న విష‌యానికి వ‌స్తే... నంద్యాల‌కు చెందిన ప్ర‌ముఖ విద్యా సంస్థ కేశ‌వ‌రెడ్డి ప‌బ్లిక్ స్కూల్ అధినేత కేశ‌వ‌రెడ్డి... స్వ‌యానా మంత్రిగారికి చాలా ద‌గ్గ‌రి బంధువు. నంద్యాల‌లో కేశ‌వ‌రెడ్డికి కాస్తంత బ‌ల‌గం కూడా ఉంది. ఇదే ఆస‌రా చేసుకున్న చంద్ర‌బాబు... ఆదికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. పార్టీ అధినేత త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను ఆసరా చేసుకున్న ఆది... ఇప్పుడు నంద్యాల‌పై పూర్తి స్థాయిలో ప‌ట్టు సాధించేందుకు కొత్త త‌ర‌హా వ్యూహం అమ‌లు చేసేందుకు రంగంలోకి దిగిపోయార‌ట‌. భూమా కుటుంబానికి నంద్యాల కాద‌న్న విష‌యం తెలిసిందే. నంద్యాల‌కు పొరుగు నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఆళ్ల‌గ‌డ్డ‌కు చెందిన భూమా నాగిరెడ్డి... గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నంద్యాల నుంచి పోటీ చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీ ఫిరాయించారు.

ఇదే అంశాన్ని ఆస‌రా చేసుకున్న ఆది... భూమా ఎటూ నాన్ లోకల్ కాబ‌ట్టి తాను కూడా అక్క‌డ రాజ‌కీయం చేసేందుకు రంగంలోకి దిగిపోయారు. ఎలాగూ త‌న వియ్యంకుడు కేశ‌వ‌రెడ్డి అక్క‌డ ఉండ‌నే ఉన్నారు కాబ‌ట్టి... త‌న‌కూ అక్క‌డ వ‌ర్గ‌ముంద‌ని ఆది కొత్త వాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చార‌ట‌. మొన్న‌టిదాకా ఈ విష‌యం గుట్టుగా ఉన్నా... ఇప్పుడు మార్కెట్ యార్డు చైర్మ‌న్ గిరీని భ‌ర్తీ చేసే విష‌యం ప్ర‌స్తావ‌న‌కు రాగానే ఈ విష‌యం ఒక్క‌సారిగా బ‌య‌ట‌ప‌డింది. స్థానిక ఎమ్మెల్యేగా త‌న సోద‌రుడు విజ‌యం సాధించార‌ని, గతంలో త‌న తండ్రి ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో అక్క‌డ త‌మ‌కే ప్రాధాన్యం ద‌క్కాల‌న్నది మంత్రి భూమా అఖిల‌ప్రియ‌ది. ఈ వాద‌న‌కు అధిష్ఠానం కూడా స‌రేనంటోంది.

అయితే ఏం సంబంధం లేకుండానే ఉప ఎన్నిక‌ల్లో తాను ఎలా ప‌నిచేస్తాన‌ని, ఏదో ఒక సంబంధం ఉన్నందునే తాను శ‌క్ర్తివంచ‌న లేకుండా కృషి చేశాన‌ని ఆది కొత్త వాద‌న‌ను వినిపిస్తున్నార‌ట‌. ఎలాగూ భూమా ఫ్యామిలీ కూడా అక్క‌డ నాన్ లోక‌లే క‌దా... తాను కూడా నాన్ లోక‌ల్ అయిన‌ప్ప‌టికీ... మొన్న భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి విజ‌యం కోసం తాను ఎంత క‌ష్ట‌ప‌డ్డాన‌న్న విష‌యాన్ని అయినా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని త‌న వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికి మార్కెట్ యార్డు చైర్మ‌న్ ప‌ద‌విని ఇవ్వాల్సిందేన‌ని ఆది ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. శిల్పా పార్టీ మార్పుతో ఇక అక్క‌డ వ‌ర్గ పోరుకు చెక్ ప‌డింద‌న్న భావ‌న‌లో ఉన్న చంద్ర‌బాబు... ఇప్పుడు ఆది ఎంట్రీతో ఇదెక్క‌డి గోల‌రా బాబూ అంటూ త‌ల‌ప‌ట్టుకున్నార‌ట‌. చూద్దాం... మ‌రి ఏం జ‌రుగుతుందో?