Begin typing your search above and press return to search.

తండ్రి అడ్డాలో ప‌ట్టు బిగిస్తోన్న అఖిల‌ప్రియ

By:  Tupaki Desk   |   10 April 2017 9:50 AM GMT
తండ్రి అడ్డాలో ప‌ట్టు బిగిస్తోన్న అఖిల‌ప్రియ
X
విల‌క్ష‌ణ‌మైన రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తాయి క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు. అక్క‌డి రాజ‌కీయాలు.. రాజ‌కీయ నేత‌ల తీరు కాస్త చిత్రంగా ఉంటుంది. ఫ్యాక్ష‌న్ క‌త్తి కొన వేలాడే నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న‌ట్లే.. అస‌లు అలాంటివేమీ లేని నియోజ‌క‌వ‌ర్గాలు.. కొన్ని చోట్ల కుల అధిపత్య పోరు.. మ‌రికొన్ని చోట్ల కుటుంబ అధిపత్య పోరు న‌డుస్తుంటాయి. మిగిలిన సీమ రాజ‌కీయాల‌కు పూర్తి భిన్నంగా ఉంటాయి క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు. అలాంటి జిల్లాలో అందునా.. నంద్యాల‌.. ఆళ్ల‌గ‌డ్డ లాంటి చోట రాజ‌కీయంగా ముందుకెళ్ల‌టం అంటే అంత చిన్న విష‌యం కాదు.

కేవ‌లం మూడేళ్ల వ్య‌వ‌ధిలో కొండంత అండ‌గా నిలిచే త‌ల్లిని.. రీసెంట్ గా తండ్రిని కోల్పోయిన భూమా ఫ్యామిలీకి ఇప్పుడు పెద్ద దిక్కుగా అఖిల ప్రియ నిలిచారు. త‌ల్లి మ‌ర‌ణంతో ఆమె స్థానంలో పోటీ చేసి విజ‌యం సాధించిన భూమా అఖిల‌ప్రియకు.. తాజాగా తండ్రి మ‌ర‌ణంతో ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నంద్యాల బాధ్య‌త‌లు కూడా నెత్తిన వేసుకోక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి.

అవ‌కాశం కోసం.. అధిప‌త్యాన్ని పెంచుకోవ‌టం కోసం కాచుక్కూర్చున్న సొంత‌పార్టీలోనూ.. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోని వారికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా ముందుకెళ్ల‌టం అంత తేలికైన ప‌ని కాదు. రాజ‌కీయాల‌కు కొత్త అయిన అఖిల‌ప్రియ ఇంత‌టి పెను స‌వాల్‌ ను ఎలా ఫేస్ చేస్తుంద‌న్న సందేహం ప‌లువురిలో ఉంది. భూమా బ‌తికి ఉన్న‌ప్పుడు.. నంద్యాల‌.. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌వ‌ర్గాల్లో తిరుగులేని అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించిన దానికి త‌గ్గ‌ట్లే.. తాజాగా అఖిల ప్రియ అదే తీరును ప్ర‌ద‌ర్శించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ప్ర‌త్య‌ర్థుల నుంచి స‌వాళ్లు ఎదుర‌వుతున్నా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆశీస్సులు మెండుగా ఉండ‌టం.. మ‌రోవైపు మేన‌మామ ఎస్వీ మోహ‌న్ రెడ్డి స‌ల‌హాలు సూచ‌న‌లు.. భూమా కుటుంబానికివిదేయులుగా ఉన్న వంద‌లాది మంది నేత‌ల కార‌ణంగా అఖిల ప్రియ‌కు భారీ ఊర‌టను ఇస్తోంది. ప్ర‌తి అంశంలోనూ క‌ష్టాల్లో ఉన్న భూమా కుటుంబానికి సాయంగానిల‌వాల‌న్నభావ‌న ప్ర‌జ‌ల్లో కూడా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు.. భావోద్వేగ అంశాల్ని తెర మీద‌కు తెస్తున్న భూమా అఖిల‌ప్రియ త‌న మాట‌ల‌తో అంద‌రికి ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు. త‌నకు తండ్రి లేని లోటును.. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అస్స‌లు తెలీనివ్వ‌టం లేద‌ని.. వారంతా త‌మ‌పిల్ల‌లుగా త‌మ‌ను చూసుకుంటున్నార‌ని చెప్ప‌టం విశేషం. దీనికి త‌గ్గ‌ట్లే.. త‌న తండ్రి ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చే ప‌నిలో అఖిల బిజీగా ఉంటూ.. అభివృద్ధి దిశ‌గా వేగంగా అడుగులు వేయ‌టం ఆమెకు క‌లిసి వ‌చ్చే అంశంగా చెప్పొచ్చు. మొత్తానికి తండ్రి లేని లోటును తెలీకుండా చేయ‌టంలో అఖిల ప్రియ చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/