Begin typing your search above and press return to search.

అఖిల మాట... ప‌వ‌న్ నోట రాలేదే!

By:  Tupaki Desk   |   1 Aug 2017 11:28 AM GMT
అఖిల మాట... ప‌వ‌న్ నోట రాలేదే!
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌కు సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేయ‌గా... అంత‌కుముందే అటు టీడీపీతో పాటు ఇటు వైపీపీ కూడా త‌మ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశాయి. నోటిఫికేష‌న్‌కు ముందుగానే ఇరు పార్టీల ప్ర‌చారం కూడా మొద‌లైపోయింది. ఇక నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది... ఎన్నిక‌ల పోలింగ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఇరు పార్టీలు కూడా త‌మ త‌మ తురుపు ముక్క‌ల‌ను ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దించేస్తున్నాయి. ఈ ఎన్నిక‌లో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్న అంశాన్ని ప‌క్క‌న‌బెడితే... విప‌క్ష వైసీపీ కంటే కూడా అధికార టీడీపీని ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌న్న‌ వాద‌న వినిపిస్తోంది. ఈ కార‌ణంగానే నోటిఫికేష‌న్ వ‌చ్చేలోగానే టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు రెండు సార్లు నంద్యాల‌లో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌టించిన రెండు ప‌ర్యాయాలు కూడా ఆయ‌న రెండు రోజుల పాటు అక్క‌డే ఉండి... రాత్రి పొద్దు పోయేదాకా పార్టీ నేత‌ల‌తో మంత‌నాలు సాగించిన వైనం మ‌న‌కు తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తైతే... మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నంద్యాల‌లో వైసీపీ విజ‌య ఢంకా మోగించింది. అయితే మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగా నాడు వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి ఆ త‌ర్వాత టీడీపీలోకి చేరిపోయారు. ఆ ఎన్నిక‌ల త‌ర్వాత అక్క‌డ మ‌రో ఎన్నిక దాదాపుగా జ‌రిగిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. దీంతో అక్క‌డ మెజార్టీ ప్ర‌జ‌ల ఓటు వైసీపీకేన‌న్న వాద‌న లేక‌పోలేదు. నాడు త‌మకు ఓట్లేసిన నంద్యాల ఓట‌ర్లు ఇప్పుడు కూడా త‌మ వెంటే న‌డుస్తార‌ని, అంతేకాకుండా.. టీడీపీ ప్ర‌భుత్వ విధానాల‌తో విసుగెత్తిపోయిన మ‌రికొంత మంది ఓట‌ర్లు కూడా ఇప్పుడు త‌మ‌వైపే తిరిగార‌ని వైసీపీ భావిస్తోంది. మొన్న‌టిదాకా నంద్యాల అభివృద్ధిపై ఏమాత్రం దృష్టిపెట్ట‌ని చంద్ర‌బాబు స‌ర్కారు... ఇప్పుడు పార్టీ అభ్య‌ర్థిని గెలిపించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా వంద‌ల కోట్ల అభివృద్ధి నిధుల‌ను విడుద‌ల చేసింద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో అక్క‌డ వైసీపీకే గెలుపు అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయ‌న్న వాద‌న గ‌ట్టిగానే వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యానికి ప్ర‌ధాన కార‌కుడిగా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వైపు టీడీపీ దృష్టి సారించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. నిన్న వెల‌గ‌పూడిలో టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ అయ్యారు. ఆ వెంట‌నే నంద్యాల‌లోనూ ప‌వ‌న్ త‌మ‌కే మ‌ద్ద‌తిస్తున్నారంటూ టీడీపీ నేత‌లు ఇప్పుడు కొత్త వాద‌న‌ను అందుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ మేర‌కు నేటి ఉద‌యం నంద్యాల‌లో ప్ర‌చారం నిర్వ‌హించిన మంత్రి భూమా అఖిల ప్రియ ఇదే వాద‌న‌ను వినిపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తమ కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయని... ఉప ఎన్నికలో తమ కుటుంబానికి ఆయన అండగా ఉంటారని ఆమె అన్నారు. అయితే ఈ విష‌యాన్ని నిన్న చంద్ర‌బాబుతో భేటీ ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట‌మాత్రంగా కూడా ప్ర‌స్తావించ‌లేదు. మ‌రి ప‌వ‌న్ మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంద‌న్న అఖిల మాట‌లో ఎంత నిజ‌ముందో తేలాలంటే ఎన్నిక‌లు ముగిసే దాకా ఆగాల్సిందేనేమో.