Begin typing your search above and press return to search.

బాబు ప‌నితీరేందో... అఖిల చెప్పేసింది!

By:  Tupaki Desk   |   9 July 2017 4:32 AM GMT
బాబు ప‌నితీరేందో... అఖిల చెప్పేసింది!
X
నారా చంద్ర‌బాబునాయుడు... టీడీపీ అధినేత‌గా - న‌వ్యాంధ్రకు ముఖ్య‌మంత్రిగా రాత్రింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్న సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌. గ‌తంలో ఉమ్మ‌డి ఏపీకి తొమ్మిదేళ్ల పాటు సీఎంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా... అంత‌కుముందు కొంత‌కాలం పాటు కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న‌కు పాల‌న‌పై మంచి ప‌ట్టే ఉంది. ఎప్పుడు ఏం చేయాల‌న్న దానిపై ఆయ‌న‌కు ఉన్న అవ‌గాహ‌న మ‌రే సీఎంకు ఉండ‌ద‌ని కూడా టీడీపీ నేత‌లు చెప్పుకుటుండ‌టం మ‌నం చూస్తున్న‌దే. గ‌తంలో సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఏ ఒక్క అధికారిని నిద్ర‌పోనివ్వ‌కుండా రాత్రింబ‌వ‌ళ్లు ప‌రుగులు పెట్టించిన చంద్ర‌బాబు... ఉద్యోగ వ‌ర్గాల‌కు వ్య‌తిరేకిగానే మారిపోయారు. ఇక నాడు త‌న‌కు ఎదురైన వ‌రుస ప‌రాజ‌యాల‌ను గుర్తు చేసుకున్నారో, ఏమో తెలియ‌దు గానీ... ఇప్పుడు ఉద్యోగుల‌ను అంత‌గా పీడించ‌డం లేద‌నే చెప్పాలి.

ఇంత‌టి ప‌నిమంతుడై చంద్ర‌బాబు చేతి కింద ఉన్న ఏ శాఖ అయినా మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌ర‌చ‌డం ఖాయ‌మే. అందులోనూ మంత్రుల‌కు వారి శాఖ‌ల్లో జ‌రుగుతున్న కార్య‌క‌లాపాల‌ను బేరీజు వేసి మ‌రీ ర్యాంకులిస్తున్న చంద్ర‌బాబు త‌న చేతిలోని శాఖ‌ను నిర్ల‌క్ష్యం చేసే ఛాన్సే లేద‌న్న వాద‌న కూడా లేకపోలేదు. అయితే బాబు గారి పాల‌న ఏ పాటిదో, ఆయ‌న చేతిలోని శాఖ ఏ మేర‌కు ప‌నిచేస్తుందోన‌న్న విష‌యాన్ని కొత్త‌గా మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన భూమా అఖిల‌ప్రియ బ‌య‌ట‌పెట్టేశారు. అఖిల ప‌ర్యాట‌క శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క‌ముందు ఆ శాఖ సీఎంగా ఉన్న చంద్ర‌బాబు త‌న‌వద్దే ఉంచేసుకున్నారు. మొన్న‌టి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అఖిల‌ను త‌న కేబినెట్ లోకి తీసుకున్న చంద్రబాబు... త‌న వ‌ద్ద ఉన్న ప‌ర్యాట‌క శాఖ‌ను ఆమెకు అప్ప‌గించారు.

ప్ర‌స్తుతం ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న అఖిల‌... నిన్న విశాఖ‌లో త‌న శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. అనంత‌రం అక్క‌డే మీడియా ముందుకు వ‌చ్చిన అఖిల‌... బాబు ప‌నితీరుకు ప‌క్కా స‌ర్టిఫికెట్ ఇచ్చేశారు. చంద్రబాబు చేతి కింద ఉన్న ప‌ర్యాటక శాఖ తీవ్ర నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని ఆమె చెప్పారు. ఈ కార‌ణంగానే రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంగానికి సంబంధించి ప్ర‌భుత్వంతో 28 ఒప్పందాలు కుద‌ర‌గా... ఇప్ప‌టిదాకా ఒక్క ఒప్పందం కూడా కార్య‌రూపం దాల్చ‌క‌పోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని కూడా ఆమె ప‌క్కా కార‌ణ‌మే చెప్పారు. మొన్న‌టిదాకా త‌న శాఖ సీఎం ఆధ్వ‌ర్వంలో ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని కూడా ఆమె చెప్పుకొచ్చారు.

అంటే పాల‌న‌లో చేయి తిరిగిన చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని శాఖ‌లో ప‌ని ఏమాత్రం జ‌రిగింద‌న్న విష‌యాన్ని అఖిల బ‌యట‌పెట్టేశార‌న్న మాట‌. అయితే సీఎం చేతి కింద ఉన్న కార‌ణంగానే త‌న శాఖ‌లో ఎలాంటి పురోగ‌తి లేదని తాను చెప్పిన విష‌యాన్ని మీడియా ఎక్క‌డ ప‌తాక శీర్షిక‌ల‌తో రాస్తుంద‌నుకున్నారో, ఏమో తెలియ‌దు గానీ ప‌ర్యాట‌క శాఖ‌లో నెల‌కొన్న జాప్యానికి కొత్త అర్థం చెప్పే య‌త్నం చేశారు. ప‌ర్యాట‌క శాఖ‌ బాధ్య‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షించిన సీఎం చంద్ర‌బాబు నిత్యం బిజీబిజీగా ఉన్న నేప‌థ్యంలోనే త‌న శాఖ నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని ఆమె చెప్పుకొచ్చారు. మ‌రి అఖిల చెప్పిన విష‌యం చంద్ర‌బాబు చెవిన ప‌డిందో, లేదో చూడాలి. ఒక‌వేళ ప‌డి ఉంటే... ఆయ‌న ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.