Begin typing your search above and press return to search.

బీజేపీ ఇలా చేసి.. ఉన్న సింప‌తీ చంపేసుకుంటోందా?

By:  Tupaki Desk   |   16 Jun 2022 4:30 PM GMT
బీజేపీ ఇలా చేసి.. ఉన్న సింప‌తీ చంపేసుకుంటోందా?
X
రాజ‌కీయ‌ల్లో వ్యూహాలు ముఖ్యం.. దీనికి ముందు.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే సానుభూతి మ‌రీ ముఖ్యం. ఎప్పుడు త‌గ్గాలో.. ఎప్పుడు నెగ్గాలో.. తెలిసి ఉంటేనే.. రాజ‌కీయాలు ముందుకు సాగుతాయి. ముఖ్యంగా ఏపీ వంటి.. అస‌మ‌తుల్య‌మైన ఓట‌రు నాడిని ప‌ట్టుకోవ‌డం అంటే.. మాట‌లు కాదు. ఈ క్ర‌మంలోనే అంద‌రూ.. ఇక్క‌డ అయితే.. క్యాస్ట్, లేక‌పోతే.. సింప‌తీల‌కు తెర‌దీసి.. త‌మ ఓటు బ్యాంకును చెక్కు చెద‌ర‌కుండా కాపాడుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం బీజేపీ చేస్తున్న ప్ర‌య‌త్నాలను ప్ర‌జ‌లు ఈస‌డించుకుంటున్నారని రాజ‌కీయ వ‌ర్గాలు వ్యాఖ్యాని స్తున్నాయి. హ‌ఠాన్మ‌రణం చెందిన మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి స్థానంలో నెల్లూరు జిల్లాలోని ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ఇది సెంటిమెంటుతోను, భావోద్వేగంతోనూ ముడిప‌డిన ఎన్నిక‌. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఈ ఎన్నిక‌కు దూరంగా ఉండ‌డం ద్వారా... రాజ‌కీయ పార్టీలు.. త‌మ ఉనికిని.. త‌మ సింప‌తీని పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తాయి.

అయితే.. త‌గుదున‌మ్మా.. అంటూ.. బీజేపీ ఇక్క‌డ పోటీ చేస్తోంది. అంతేకాదు... `ప్ర‌చారానికి అతిర‌థ మ‌హార థులు వ‌స్తున్నారు` అంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చింది. మ‌రి ఈ అతిర‌థ మ‌హార‌థులు వ‌చ్చి ఏం చేస్తారు? ఒక్క స్థానం కోసం.. త‌ల‌కిందులు ప‌డతారా? అంటే.. పిచ్చిక మీద‌బ్ర‌హ్మాస్త్రం మాదిరిగా.. సింప‌తీ ఎన్నిక‌ల‌లో స‌త్తా చాటుతారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. నిజానికి ఈ అతిర‌థ మ‌హార‌థులు ఎప్పుడు రావాలి.. అస‌లు ఇప్పుడు ఏం చేయాలి? అనేది ప్ర‌శ్న‌.

ముందు పార్టీ బ‌లోపేతం పై దృష్టి పెట్టాలి. ఇలాంటి స్థానాల‌ను వ‌దుల‌కుని.. సింప‌తీ ప్ర‌య‌త్నాలు చేయాలి.. ఒక‌వేళ ఇక్క‌డ పోటీ చేసి గెలిచినా.. ఒక్క ఎమ్మెల్యేతో ఏం సాధిస్తారు. రేపు ఆయ‌న పార్టీ కండువా మార్చేయ‌డ‌ని గ్యారెంటీ ఏంటి? వీటికి స‌మాధానాలు లేవు. పోనీ.. ఇంతా చేస్తే.. పార్టీకి ఒన‌కూరే ఒటు బ్యాంకు పెరుగుతుందా? అంటే అది కూడా లేదు.

కానీ.. ఒక్కటి మాత్రం వాస్త‌వం.. బీజేపీ వంటి పార్టీలు.. మ‌రింత దిగ‌జారుతున్నాయ‌నే వ్యాఖ్య‌లు మాత్రం అన్ని వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు .. జ‌రిగిన తిరుప‌తి, బ‌ద్వేల్ ఉప పోరులో ఏం సాధించారో.. ఇప్పుడు కూడా అదే ఫ‌లితం వ‌స్తుంద‌ని.. రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.