Begin typing your search above and press return to search.

రాజీవ్ భార‌త ర‌త్న వెన‌క్కు.. అసెంబ్లీలో ర‌చ్చ‌ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   22 Dec 2018 10:18 AM GMT
రాజీవ్ భార‌త ర‌త్న వెన‌క్కు.. అసెంబ్లీలో ర‌చ్చ‌ర‌చ్చ‌
X
దేశ రాజ‌ధాని ఢిల్లీ అసెంబ్లీలో మ‌రోమారు హాట్ హాట్ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీకి ఇచ్చిన భార‌త‌ర‌త్న అవార్డును వెన‌క్కి తీసుకోవాల‌ని ఢిల్లీ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానం తీవ్ర వివాదానికి కార‌ణ‌మైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణాంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను సమర్థించినందుకు ఆమె కుమారుడు, దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీకి ఇచ్చిన భారతరత్న పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ అసెంబ్లీ శుక్రవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. అనంతరం ఈ విషయంపై దుమారం రేగడంతో ఆప్ మాట మార్చింది. అయితే, ఈ ఎపిసోడ్ ర‌చ్చ‌రచ్చ‌గా మారింది.

సిక్కు అల్ల‌ర్ల‌ను రాజీవ్ స‌మ‌ర్థించారు కాబ‌ట్టి, ఆయ‌న‌కు ఇచ్చిన భార‌త‌ర‌త్న‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. వాస్త‌వానికి అది తీర్మానం కాదు అని, ఎమ్మెల్యే జ‌ర్నైల్ సింగ్ చేసిన తీర్మానానికి ఓ స‌వ‌ర‌ణ మాత్ర‌మే అని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ వెల్ల‌డించింది. రాజీవ్‌పై ఎటుంటి తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని ఆప్ పేర్కొంది. 1984లో జ‌రిగిన సిక్కు అల్ల‌ర్ల‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు న్యాయం చేయాల‌ని ఎమ్మెల్యే సింగ్ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఆ తీర్మానానికి సోమ్‌నాథ్ భార‌తి ఓ ప్ర‌తిపాద‌న చేశారు. రాజీవ్‌కు ఇచ్చిన భార‌త ర‌త్న‌ను ర‌ద్దు చేయాల‌ని భార‌తి త‌న స‌వ‌ర‌ణ‌లో కోరారు. ఆ స‌వ‌ర‌ణ‌ను ఆయ‌న తీర్మానానికి జ‌త చేశారు. అయితే ఆ స‌మ‌యంలో మ‌రో ఎమ్మెల్యే అల్కా లంబా ఆ తీర్మానాన్ని స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో దుమారం ముదిరింది.

స‌వ‌ర‌ణ ప్ర‌వేశ‌పెట్టిన సోమ‌నాథ్ భార‌తి ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. త‌న‌ది స‌వ‌ర‌ణ మాత్ర‌మే అని, అది ఓటింగ్ కోసం పెట్టిన తీర్మానం కాదు అని, అంటే ఆ అంశానికి అసెంబ్లీలో ఆమోదం ద‌క్క‌లేద‌న్న అర్థం వ‌స్తుంద‌ని, దీంతో ఈ వివాదం ముగిసిన‌ట్లు అవుతుంద‌ని సోమ్‌నాథ్‌ భార‌తి ఆ ట్వీట్‌లో తెలిపారు. కానీ సోమ‌నాథ్ భార‌తి ప్ర‌వేశ‌పెట్టిన స‌వ‌ర‌ణ తీర్మానం ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యే అల్కా లంబా పాలిట శాపంగా మారింది. ఆ స‌వ‌ర‌ణ ప్ర‌వేశ‌పెట్టిన స‌మ‌యంలో తాను స‌భ నుంచి వాకౌట్ చేసిన‌ట్లు లంబా పేర్కొన్నారు. కానీ ఆమె ప‌ట్టుబ‌ట్ట‌డం వ‌ల్లే స‌వ‌ర‌ణ ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆప్ నేత‌లంటున్నారు. ఎమ్మెల్యే అల్కా లంబా గ‌తంలో కాంగ్రెస్ పార్టీకే ప‌ని చేశారు. నాలుగేళ్ల క్రితం ఆమె ఆప్‌లో చేరారు. అయితే తాను రాజీవ్‌పై స‌వ‌ర‌ణ‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని అల్కా అంటున్నారు. కానీ ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ మాత్రం ఈ ఘ‌ట‌న ప‌ట్ల సీరియ‌స్‌గా ఉన్నారు. అల్కా లంబా రాజీనామా చేయాల‌ని కేజ్రీ డిమాండ్ చేశారు. కేజ్రీ కోరిన‌ట్లే తాను రాజీనామా చేస్తాన‌ని అల్కా తెలిపారు.