Begin typing your search above and press return to search.

బారత్ బయోటెక్ ఏడాదిలో ఎన్ని టీకాలు తయారు చేసే సత్తా ఉంది?

By:  Tupaki Desk   |   3 Jan 2021 4:41 AM GMT
బారత్ బయోటెక్ ఏడాదిలో ఎన్ని టీకాలు తయారు చేసే సత్తా ఉంది?
X
కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంచలనంగా మారటం తెలిసిందే. తాజాగా ఈ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. సాంకేతికంగా చూస్తే.. మరో అనుమతి అవసరం. అయితే.. అది లాంఛనమేనని చెప్పాలి. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కు సమీపంలోని జీనోమ్ వ్యాలీలో ఈ వ్యాక్సిన్ ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెండో దశ క్లినికల్ ప్రయోగాలు పూర్తి అయ్యాయి.

ఇంతకీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ కు ఏడాదిలో ఎన్ని వ్యాక్సిన్లు తయారు చేసే సామర్థ్యం ఉందన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం ఆసక్తికరంగానే కాదు.. కంపెనీ సత్తా తెలిపేలా ఉంది. టీకా డిమాండ్ కు తగ్గట్లు ఏడాదికి 30 కోట్ల డోసుల్ని తయారు చేసే సామర్థ్యం భారత్ బయో టెక్ కు ఉంది. మరి.. ప్రస్తుతానికి ఎన్ని డోసుల్ని తయారుచేశారన్న విషయంలోకి వెళితే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం కోటి డోసుల్ని తయారు చేసినట్లుగా తెలుస్తోంది.

రెండు డోసుల్లో ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. టీకా వేయించుకున్న 28వ రోజున రెండో డోసును వేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఏడాదికి 30 కోట్ల డోసుల్ని తయారు చేసే సామర్థ్యం ఉన్నప్పటికి.. అవసరమైతే మరింత ఎక్కువగా డోసుల్ని తయారు చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. చూస్తుంటే.. కరోనా వ్యాక్సిన్ రేసులో.. కోవాగ్జిన్ ముందుండే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.