Begin typing your search above and press return to search.

బూస్టర్ డోసు ట్రయల్స్ పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన !

By:  Tupaki Desk   |   2 April 2021 11:30 AM GMT
బూస్టర్ డోసు ట్రయల్స్ పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన !
X
కరోనా వైరస్ ను అరికట్టడానికి తీసుకువచ్చిన కోవాగ్జిన్ టీకా‌ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకా రెండు డోసుల్లో ఇస్తుండగా, వాటి వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనే దానిపై సరైన స్పష్టత లేదు. దీనితో మూడో డోసు అంటే .. బూస్టర్ డోసు అవసరం చాలా ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ కు బూస్టర్ డోస్ ప్రతిపాదించింది. అలాగే, ఈ బూస్టర్ డోస్ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నిపుణుల కమిటీకి కొన్ని సవరణలను ప్రతిపాదించింది.

వీటిపై సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత 6ఎంసీజీ మోతాదులో ప్రయోగాలను కొనసాగించవచ్చని డీసీజీఐ నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది. మూడో డోసు ఇచ్చిన తర్వాత ఆరు నెలలపాటు కమిటీ సిఫార్సులను పాటించాలని భారత్ బయోటెక్ ‌కు సూచించింది. ప్రయోగాల ప్రాథమిక, ద్వితీయ లక్ష్యాల వివరాలను కూడా కమిటీకి అందించాలని కోరింది. మార్చి 23వ తేదీన జరిగిన నిపుణుల కమిటీ భేటీలో బూస్టర్ డోసుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిబంధనల్లో మార్పులు, ప్రయోగాల లక్ష్యాలపై భారత్ బయోటెక్ ‌తో సుదీర్ఘంగా చర్చించింది.

కాగా, ఈ బూస్టర్ డోసు ప్రయోగాల్లో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లకు రెండో డోసు తీసుకున్న ఆరు నెలల గడువు తర్వాత మూడో డోసు ఇచ్చి పరీక్షిస్తారు. కాగా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా 81 శాతం సమర్థత కనబరిచినట్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్‌ లో వెల్లడైంది. సుమారు 25,800 మంది వాలంటీర్లపై నిర్వహించిన ప్రయోగాల్లో కోవాగ్జిన్ టీకా సురక్షితమని తేలినట్లు భారత్ బయోటెక్ ఈ మద్యే ప్రకటించింది. అంతేగాక, ఇక కొత్తగా వెలుగుచూసిన కొత్త రకాల పైనా కోవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. కొవాగ్జిన్ టీకా సురక్షితమేనని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.