Begin typing your search above and press return to search.

ఓటర్ల తొలగింపుకు వేటు తప్పదా?

By:  Tupaki Desk   |   31 Oct 2015 3:57 AM GMT
ఓటర్ల తొలగింపుకు వేటు తప్పదా?
X
పాలకుల అండదండలు ఉన్నాయనే మదగర్వంతో కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరిస్తే ఎంతటి వాడికైనా శృంగభంగం తప్పదని మరోసారి రుజువైంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది ఓటర్లను తొలగించిన వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న కేంద్ర ఎన్నికల కమిషన్ సంబంధిత అధికారుల చర్యపై విచారణ బృందాన్ని పంపించింది. పాలక తెరాస పార్టీ పనుపున లక్షలాది మంది ఓటర్ల తొలగింపుకు కారకులయ్యారంటూ తెలంగాణ ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌ లాల్ - జిహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్‌ లపై కనీ వినీ ఎరుగని ఆరోపణలు వెల్లువెత్తడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్ర చర్యను చేపట్టింది. ఈ ఆరోపణలపై విచారణకు గాను ఈసీ 14 మంది సబ్యులతో కూడిన విచారణ బృందాన్ని హైదరాబాద్‌ కు పంపింది. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ భన్వర్‌ లాల్ - సోమేష్ కుమార్‌ లపై వేటు వేయవచ్చని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఈసీ నియమించిన విచారణ కమిటీ ప్రస్తుతం హైదరాబాద్‌ లో పర్యటిస్తోంది. నియమనిబంధనలకు విరుద్ధంగా ఎన్ని ఓట్లను తొలగించారన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఈ బృందం ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో విచారణను ప్రారంబించింది. భన్వర్‌ లాల్ - సోమేష్ కుమార్ ఇరువురూ టీఆరెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికే వీరు జీహెచ్ ఎంసీ పరిధిలో 7 లక్షల మంది ఓటర్లను తొలగించారని, మరో 19 లక్షల మంది ఓటర్లకు వారి పేర్ల తొలపింపుపై నోటీసులు జారీ చేశారని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ - టీడీపీ - బీజేపీ ఆరోపించాయి.

ఇలా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిలో చాలామంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారేనని జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇంత భారీ స్థాయిలో ఓట్లతొలగింపుకు ఇద్దరు అధికారులూ రంగం సిద్దం చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. శనివారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తమ ఆరోపణలకు సాక్ష్యాధారాలు చూపించాలని ఆయా పార్టీలను కోరింది. ఈ వివరాలన్నింటిపై విచారణ జరుపుతున్న కమిటీ తన నివేదికను ఎన్నికల కమిషన్‌ కు సమర్పించనుంది.

కొసమెరుపు ఏమిటంటే ఈసీ తరపున విచారణ కమిటీ హైదరాబాద్ వచ్చి విచారణ చేపట్టిన తరుణంలో ఉన్నట్లుండి తెరాస ప్రభుత్వం తెలంగాణలో కీలక పదవుల్లోని ఐఎఎస్ అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేయడం గమనార్హం. సీమాంధ్రుల పట్ల కర్కోటక అధికారిగా పేరొందిన సోమేష్ కుమార్‌ ను గిరిజన శాఖకు గిరాటేయడం విశేషం.