Begin typing your search above and press return to search.

జైల్లోనూ భానుని కంట్రోల్ చేయలేకపోతున్నారట

By:  Tupaki Desk   |   1 July 2016 4:28 AM GMT
జైల్లోనూ భానుని కంట్రోల్ చేయలేకపోతున్నారట
X
భానుకిరణ్ గుర్తున్నాడా? అవును.. మద్దెల చెరువుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన భాను.. చివరకు తన బాస్ నే చంపేసిన వైనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్ ఆ కేసులో జైల్లోనే ఉన్నాడు.

సూరి హత్యతో తన పేరును ఒక బ్రాండ్ గా మార్చేసుకొని దందా షురూ చేసినట్లుగా భాను కిరణ్ మీద పలు ఆరోపణలు వచ్చాయి. అయితే.. వీటికి సంబంధించిన వివరాలు.. ఆధారాలు పెద్దగా బయటకు రాని పరిస్థితి. జైల్లో సేఫ్ గా ఉంటూ.. తన దందాను తాను నడిపిస్తున్నట్లుగా భాను మీద చాలానే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఇతగాడి మీద చర్యల విషయంలో అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. చర్లపల్లి జైల్లో ఉన్న భాను కిరణ్ ను భరించటం తమ వద్దకాదని చర్లపల్లి జైలు అధికారులు కోర్టులో పిటీషన్ వేసినట్లుగా చెబుతున్నారు. జైలు నుంచి దందాలు చేయటం.. అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేయటం.. తన ఇష్టారాజ్యంగా వ్యవహరించటంపై తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ.. ఆయన్ను ఏమీ చేయలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇటీవల కోహ్లీ గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించే క్రమలో వారి వెనుక భాను కిరణ్ ఉన్నట్లు తెలుసుకొని షాక్ తిన్న పరిస్థితి. జైల్లో ఉంటూనే ఇంత నెట్ వర్క్ ఎలా మొయింటైన్ చేస్తున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో భానును చర్లపల్లి జైల్లో తాము ఉంచలేమని.. అతడ్ని చంచలగూడ జైలుకు తరలించాలంటూ జైలు అధికారులు నాంపల్లి కోర్టులో పిటీషన్ వేయటం ఆసక్తికరంగా మారింది. బయట ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారన్నది పక్కనపెడితే.. జైల్లో ఉండి కూడా తన దందాను యదేచ్ఛగా నిర్వహించటం చూస్తే.. అతగాడి వెనక పెద్ద తలకాయలు ఓ స్థాయిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. జైలుఅధికారుల పిటీషన్ ను చూస్తే.. భానును కంట్రోల్ చేసే మొనగాడు ఎవరూ లేరా అనిపించక మానదు.