Begin typing your search above and press return to search.

మీ నిర్లక్ష్యంతో మీ వాళ్లను చంపేయటానికి మీరు సిద్ధమా?

By:  Tupaki Desk   |   25 March 2020 11:00 PM IST
మీ నిర్లక్ష్యంతో మీ వాళ్లను చంపేయటానికి మీరు సిద్ధమా?
X
విన్నంతనే ఉలికిపాటు. కట్టలు తెగే కోపం రావొచ్చు చదివినంతనే. కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసినప్పుడు ఇలాంటి మాటలు అనకుండా ఉండలేని పరిస్థితి. ఇప్పుడున్నది చాలా ప్రత్యేక సందర్భమన్న విషయాన్ని మర్చిపోతున్న ప్రజలు చిన్న చిన్న విషయాల కోసం.. అవసరాల కోసం బయటకు వస్తున్నారు. మరికొందరు దీన్నో జాయ్ మూడ్ గా భావిస్తున్న తీరు చూస్తే.. మరీ ఇంత నిర్లక్ష్యమా అన్న భావన కలుగక మానదు.

ఇంటి నుంచి బయటకు వచ్చేవారు.. తమను తాము వైరస్ బారిన పడే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే కాదు.. ఇంట్లోని తమ వాళ్ల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నది మర్చిపోకూడదు. ఎవరెంత చెప్పినా.. ఇప్పుడున్నది అత్యంత సంక్లిష్టమైన సమస్య అని.. కరోనాతో యుద్ధమన్నది అంత చిన్న విషయం కాదని చెబుతున్నా.. చాలామంది చెవికి ఎక్కని పరిస్థితి.

మీకెంతో ఇష్టమైన మీ కుటుంబ సభ్యుల్ని మీ చేతులారా చంపుకోవాలనుకుంటున్నారా? అన్న ప్రశ్న వేస్తే చాలామందికి కోపం కలుగవచ్చు. కానీ.. వారి వైఖరి అలాంటి పనే చేస్తుందన్నది మర్చిపోకూడదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే విషయంలో ప్రదర్శించే నిర్లక్ష్యం.. వ్యక్తిగత శుభ్రత విషయంలోనూ.. ఇంటి వాతావరణంలోనూ జాగ్రత్తగా ఉండే అవకాశం లేనట్లే. అలాంటప్పుడు నీతో పాటు నీ ఇంట్లోని వారంతా కరోనా బారిన పడితే కాపాడే దిక్కు కూడా ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీయాలన్న ఆలోచన కలలో కూడా రానప్పుడు.. ఆ ముప్పును తీసుకొచ్చేలా మీరెందుకు బయటకు వెళుతున్నట్లు..?