Begin typing your search above and press return to search.

బెర్ముడా ట్రయాంగిల్ గుట్టు వీడింది

By:  Tupaki Desk   |   3 Aug 2018 7:11 AM GMT
బెర్ముడా ట్రయాంగిల్ గుట్టు వీడింది
X
ప్ర‌పంచంలో చాలా స‌వాళ్లు ఉన్నా.. కొన్నింటి విష‌యంలో యావ‌త్ ప్ర‌పంచం ఆస‌క్తి వ్య‌క్తం చేస్తుంటుంది. అలాంటిదే బెర్ముడా ట్ర‌యాంగిల్. అట్లాంటిక్ స‌ముద్రంలో మ‌యామి.. సాన్ యువాన్.. ప్యూర్టోరికో మ‌ధ్య‌నున్న 7 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల ప్రాంతానికి బెర్ముడా ట్ర‌యాంగిల్ అని పేరు. మృత్యువున‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఈ ప్రాంతాన్ని చెబుతారు. ఈ ప్రాంతంలో ప్ర‌యాణించే ఓడ‌లు.. విమానాలు మాయ‌మ‌వుతాయి. మ‌ళ్లీ ఆచూకీ కూడా దొర‌క‌దు. ఎందుకిలా అన్న అంశంపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ప‌రిశోధ‌న‌లు జ‌రిగినా.. అస‌లు కార‌ణాన్ని మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ క‌నుగొన‌లేదు.

తాజాగా ఒక మీడియా సంస్థ (ఛాన‌ల్ 5) భారీగా ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టింది. ఎంతోమంది నిపుణులు.. ప్ర‌ముఖుల‌తో మాట్లాడి.. స్వ‌యంగా ప‌రిశోధించి బెర్ముడా ట్ర‌యాంగిల్ ర‌హ‌స్యాన్ని చేధించే ప‌ని షురూ చేసి స‌క్సెస్ అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు వెయ్యి మందిని పొట్ట‌న పెట్టుకున్న బెర్ముడా ట్ర‌యాంగిల్ మృత్యుపాశం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిట‌న్న‌ది త‌న తాజా డాక్యుమెంట‌రీలో స్ప‌ష్టం చేసింది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న న‌మ్మ‌కాల ప్ర‌కారం అక్క‌డ కృష్ణ బిలం ఉంద‌ని.. బ్లాక్ మేజిక్ వ‌ల్లే ఇలా జ‌రుగుతుంద‌ని.. ఏలియ‌న్స్ ఇక్క‌డ తిష్ట వేశార‌న్న మాట‌లేవీ నిజం కాద‌ని తేల్చింది. కేవ‌లం వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు.. మ‌రెక్క‌డా లేని రీతిలో ఇక్క‌డి ప్ర‌త్యేక ప‌రిస్థితులే కార‌ణంగా తేల్చింది.

బెర్ముడా ట్ర‌యాంగిల్ వ‌ద్ద ఏర్ప‌డే రాకాసి అల‌లే మొత్తం ప్ర‌మాదాల‌కు కార‌ణంగా తేల్చారు. వినేందుకు విచిత్రంగా ఉన్నప్ప‌టికీ.. ఏ మాత్రం న‌మ్మ‌టానికి వీల్లేన‌ట్లుగా ఉన్నా.. ఇది నిజ‌మ‌ని చెబుతున్నారు. దాదాపు వంద అడుగుల ఎత్తులో ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా.. వేగంగా వ‌చ్చే బ‌ల‌మైన రాకాసి అల‌లే మొత్తం విప‌త్తుకు కార‌ణంగా చెబుతున్నారు.

మ‌రింతటి రాకాసి అల‌లు ఎందుకు వ‌స్తున్నాయి? దానికి కార‌ణం ఏమిటి? అన్న విష‌యంలోకి వెళితే.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని చెబుతున్నారు.

బెర్ముడా ట్రాయాంగిల్ వ‌ద్ద‌నున్న స‌ముద్రంలో ఒకేసారి వేర్వేరు దిశ‌ల నుంచి చుట్టుముట్టే తుఫాన్ల కార‌ణంగానే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని తేల్చారు. అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌శాంతంగా ఉన్న వాతావ‌ర‌ణం క్ష‌ణాల్లో మారిపోతుంద‌ని.. వివిధ దిశ‌ల నుంచి వ‌చ్చే తుఫాన్లు అక్క‌డ తీవ్రంగా మారిపోయి క్ష‌ణాల్లో ప్ర‌ళ‌యంగా మారుతుంద‌ని..ఆ స‌మ‌యంలో వంద అడుగుల ఎత్తులో బ‌ల‌మైన అల‌లు.. వేగంగా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా విరుచుకుప‌డ‌తాయ‌ని.. వాటి ఉధృతికి అటువైపు వెళ్లే విమానాలు.. ఓడ‌లు మునిగిపోవ‌ట‌మే కాదు.. ఆ వేగానికి ఏటు కొట్టుకు వెళ‌తాయో అర్థం కాని ప‌రిస్థితి ఉంటుంద‌ని చెబుతున్నారు. తాజాగా ఆ రాకాసి అల‌ల‌కు రోగ్స్ వేవ్స్ అన్న పేరును పెట్టేశారు. ఇంత‌కాలం అంతుచిక్క‌నట్లుగా ఉన్న గుట్టు తాజా ప‌రిశోధ‌న‌తో ర‌ట్టు అయిన‌ట్లేన‌ని చెబుతున్నారు.