Begin typing your search above and press return to search.

లే ఆఫ్ క‌ష్టాలు..లేబ‌ర్ క‌మిష‌న‌ర్ వ‌ద్ద‌కు టెకీలు

By:  Tupaki Desk   |   2 Jun 2017 3:02 PM GMT
లే ఆఫ్ క‌ష్టాలు..లేబ‌ర్ క‌మిష‌న‌ర్ వ‌ద్ద‌కు టెకీలు
X
ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొల‌గింపు ప్ర‌క్రియ సాగుతున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల తెర‌మీద‌కు వ‌చ్చిన ప‌రిణామం యూనియ‌న్ ఏర్పాటు! పొరుగు రాష్ట్రమైన త‌మిళ‌నాడులో ఈ ఆస‌క్తిక‌ర‌మైన ఎపిసోడ్ మొద‌టగా చోటుచేసుకుంది. తమిళనాడులో ఐటి ఉద్యోగులు సంఘటితమై ``ఫోరం ఆఫ్‌ ఐటీ ఎంప్లాయీస్‌, తమిళనాడు (ఫైట్‌)`` పేరుతో సంఘం స్థాపించుకున్నారు. త‌మ సంఘాన్ని ఇత‌ర రాష్ర్టాల‌కు విస్త‌రిస్తామ‌ని ప్ర‌క‌టించిన సంఘం బాధ్యులు దాన్ని ఆచ‌ర‌ణ‌లో చూపుతూ ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీ అనే పేరున్న బెంగ‌ళూరుకు ఫైట్ శాఖను విస్త‌రించారు.

బెంగ‌ళూరులో ఏర్పాటైన ఫైట్ సంస్థ స‌భ్యులు ప‌లు సంస్థల నుంచి తొల‌గించబ‌డిన ఉద్యోగుల ప‌క్షాన గ‌ళం విప్పింది. టెక్ మ‌హీంద్రా నుంచి తొల‌గింబ‌చ‌డిన న‌లుగురు ఉద్యోగులు, విప్రో నుంచి ఉద్వాస‌న‌కు గురైన ఒక్క‌రితో క‌ర్ణాట‌క లేబ‌ర్ క‌మిష‌న‌ర్ వ‌ద్ద పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు బెంగ‌ళూరు ఫైట్ సంస్థ ప్ర‌తినిధులు మీడియాకు తెలిపారు. ఈ ఉద్యోగులంతా కంపెనీల నుంచి బ‌ల‌వంతంగా ఉద్వాస‌న‌కు గురైన వార‌ని వివ‌రించారు. లేబ‌ర్ క‌మిష‌న‌ర్ ఆర్ఆర్ జ‌న్నూ త‌మ ఫిర్యాదును స్వీక‌రించి సంబంధిత భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో చ‌ర్చించ‌నున్న‌ట్లు హామీ ఇచ్చార‌ని ఫైట్ ప్ర‌తినిధులు వెల్లడించారు.

ప్ర‌స్తుతం ఐటీ రంగంలో నెల‌కొన్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల నేప‌థ్యంలో అనేక మందిపై ఉద్యోగం తొల‌గింపు క‌త్తి వేలాడుతోంది. ఈ నేప‌థ్యంలో రాబోయే ఐదేళ్ల‌కాలంలో సుమారు 5 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు ఊడిపోనున్న‌ట్లు విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బ‌ల‌వంతంగా ఉద్వాస‌న‌కు గుర‌య్యే వారు పోరాటాన్ని మ‌రింత‌గా ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. త‌మిళ‌నాడులో మొద‌ట‌గా ఏర్ప‌డిన ఫైట్ యూనియ‌న్‌లో 100 మందికిపైగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సభ్యులుగా సంతకాలు చేశారు. మహిళా ఉద్యోగినులకు భద్రత, ఐటీ సంస్థల్లో కార్మిక చట్టాల అమలు, ఉద్యోగుల హక్కులను కాపాడడం కోసం సంస్థ పనిచేస్తుందని సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు తెలిపారు.

ఈ సంఘం ఏర్ప‌డిన అనంత‌రం తొల‌గించ‌బ‌డిన ఉద్యోగుల్లో కొంద‌రు త‌మిళ‌నాడు రాష్ట్ర కార్మిక శాఖ‌ను ఆశ్ర‌యించారు. తెలంగాణలో ప‌లువురు ఉద్యోగుల‌కు తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అండ‌గా నిలిచి కార్మిక‌శాఖ‌ను ఆశ్ర‌యించింది. ఇందులో కాగ్నిజెంట్ నుంచి తొల‌గించ‌బ‌డిన ముగ్గురిని ఉద్యోగంలోకి తీసుకునేలా కృషి చేసింది. అయితే ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది కొత్త‌గా ఏర్ప‌డే యూనియన్ల‌లో చేరడానికి ఇష్టపడడం లేదని స‌మాచారం. యూనియన్‌లో చేరితే తాము పనిచేస్తున్న సంస్థల నుంచి అనవసరమైన ఇబ్బందులు వస్తాయని ఉద్యోగులు భావిస్తున్నట్టు తెలిసింది. మ‌రోవైపు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చి స‌మ‌స్య‌లు విన్న‌వించుకునే ఉద్యోగుల‌కు ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటామ‌ని ఫైట్ సంస్థ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు ఐటీ రంగం ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌లు, లే ఆఫ్ కార‌ణంగా తొల‌గింపుల విష‌య‌మై త్వ‌రలో ఐటీ ఉద్యోగుల సంఘాల‌తో స‌మావేశం కానున్న‌ట్లు క‌ర్ణాట‌క ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖ‌ర్గే తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/