Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్టు లో కుప్పకూలిన బెంగాలీ సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   18 Feb 2020 1:00 PM IST
ఎయిర్ పోర్టు లో కుప్పకూలిన బెంగాలీ సూపర్ స్టార్
X
బెంగాలీ ప్రముఖ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపాస్‌ పాల్ మంగళవారం గుండెపోటుతో ముంబై లోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. ఈయన గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మద్యే తన కూతురిని చూడటానికి ముంబై కి వచ్చిన తపాస్‌ పాల్ , తిరిగి కోల్‌కతాకు వెళ్లేందుకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ముంబై విమానాశ్రయానికి వచ్చారు. అయితే , ముంబై విమానాశ్రయంలో ఆయనకి ఒక్క సారిగా గుండెనొప్పి రావడంతో హుటాహుటిన ఆయన్ను జుహులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే , అప్పటికే తపాస్‌ పాల్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కాగా,తపస్ పాల్ 1980లో తరుణ్‌ మజుందార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'దాదర్‌ కీర్తి' సినిమాతో బెంగాలీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత బెంగాలీలో పలు సూపర్ హిట్స్ సినిమాలలో నటించారు. 1984లో వచ్చిన అబోధ్ చిత్రంలో మాధురీ దీక్షిత్‌ తో కలిసి ఈయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. హిరెన్ నాగ్ దర్శకత్వం లో వచ్చిన ఈ అబోధ్ సినిమా హీరోయిన్ మాధురీ దీక్షిత్ కెరియర్ లో మొదటి సినిమా కావడం విశేషం. ఇక తన నట ప్రస్థానంలో ప్రొసేన్‌ జీ ఛటర్జీ,సౌమిత్ర ఛటర్జీ,రాఖీ,మౌసమి ఛటర్జీ వంటి నటీనటులతో ఆయన నటించారు. అయన చివరిసారిగా 2013లో ఖిలాడీ అనే చిత్రం ద్వారా వెండి తెరపై మెరిశారు.

ఇకపోతే , తపాస్‌ పాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎంపీగా, ఒకసారిగా ఎమ్మెల్యేగా ఎంపికైయ్యారు. ఆ తరుణంలోనే చిట్ ఫండ్ స్కామ్‌ లో డిసెంబర్ 31,2016లో అరెస్ట్ అయ్యి ., 13 నెలల జైలు జీవితం కూడా గడిపారు. ఆ తరువాత బెయిల్‌ పై విడుదలయ్యారు. ఆ తరువాత అయన సినీరంగానికి , రాజకీయాలకి దూరంగా ఉంటూవచ్చారు. తపస్ పాల్‌ కు భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు. ఆయన మృతిపై పలువురు బెంగాలీ నటులు ,తృణమూల్ కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.