Begin typing your search above and press return to search.

బెంగాల్ దంగ‌ల్‌: బీజేపీని ద‌డ‌పెడుతున్న మ‌మ‌త పాలిటిక్స్ ..!

By:  Tupaki Desk   |   26 March 2021 9:12 AM GMT
బెంగాల్ దంగ‌ల్‌: బీజేపీని ద‌డ‌పెడుతున్న మ‌మ‌త పాలిటిక్స్ ..!
X
బెంగాల్ ఎన్నిక‌ల ముంగిట‌.. బీజేపీకి చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ముఖ్య‌మంత్రి మ‌మతా బెన‌ర్జీ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు.. క‌మ‌ల నాథుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. ఒక‌ప్పుడు.. బెంగాల్ అంటే.. క‌మ్యూనిస్టుల కంచుకోట‌. దాదాపు 35 ఏళ్ల‌పాటు రాష్ట్రాన్ని అప్ర‌తిహ‌తంగా పాలించిన క‌మ్యూనిస్టుల ప్లేస్‌ను దాదాపు బీజేపీ ఆక్ర‌మించేసింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఎక్క‌డ విన్నా.. ఎక్క‌డ క‌న్నా.. బీజేపీ వ‌ర్సెస్ మ‌మ‌తా అన్న విధంగానే పోరు సాగుతోంది. ఇక‌, మ‌మ‌త ప‌రంగా చూసుకుంటే.. ఇప్ప‌టికే రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న మ‌మ‌త‌.. త‌నకు బ‌ద్ధ‌శ‌త్రువైన బీజేపీకి ఎట్టి ప‌రిస్థితిలోనూ బెంగాల్లో చోటు ఇవ్వ‌కూడ‌ద‌న్న క‌సితో ఉన్నారు.

అంతేకాదు. తానుముచ్చ‌ట‌గా మూడోసారి కూడా విజ‌యం ద‌క్కించుకుని... రికార్డు సృష్టించాల‌నే సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నారు.. అయితే.. మ‌రోవైపు.. బీజేపీ నేత‌లు కూడా మ‌మ‌త హ్యాట్రిక్ ఆశ‌ల‌కు క‌ళ్లెం వేయ‌డంతో పాటు త‌మ‌కు స్వ‌ప్నంగా ఉన్న బెంగాల్‌పై కాషాయ జెండా ఎగ‌ర‌వేయాల‌ని క‌సితో ప‌ని చేస్తున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ కీల‌క నాయ‌కులు భారీ ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. సినీ వ‌ర్గాల‌కు సైతం టికెట్లు ఇస్తున్నారు. ఇక‌, బాలీవుడ్ తార‌ల‌ను ప్ర‌చారంలోకి దింపేలా కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తం 8 ద‌శ‌ల‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఎక్క‌డికక్క‌డ ఏద‌శ‌కు ఆ ద‌శ‌ను కీల‌కంగా భావించాల‌ని బీజేపీ నేత‌లు నిర్ణ‌యించారు..

ఈ క్ర‌మంలో మ‌మ‌త హ‌వాకు ఒకింత బ్రేక్ ప‌డుతుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌మ‌త‌కు ఈ సారి గెలుపు అంత వీజీకాద‌నే రాజ‌కీయ వ‌ర్గాలు, ప్రీ పోల్ స‌ర్వేలు అంచ‌నా వేస్తున్నాయి. దీంతో మ‌మ‌త వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఎక్క‌డ ప్ర‌చారం నిర్వ‌హించినా.. పెట్రో ధ‌ర‌ల‌ను రెయిజ్ చేస్తున్నారు. లీట‌రు పెట్రోల్‌పై తాను రూ.1 వ‌ర‌కు త‌గ్గించాన‌ని.. మ‌రి మోడీ ఏం చేస్తున్నాడో.. ప్ర‌శ్నించాల‌ని మ‌మ‌త ఒక విధంగా ప్ర‌జ‌ల‌కు నూరిపోస్తున్నారు..

కీల‌క స‌మయంలో ఇప్పుడు బీజేపీకి పెట్రోల్‌, నిత్యావ‌స‌ర ధ‌ర‌ల సెగ త‌గిలేలా.. మ‌మ‌త దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రెండు రోజుల కింద ప్ర‌ధాని మోడీ నిర్వ‌హించిన ఎన్నిక‌ల స‌భ‌లో.. అనూహ్యంగా పెట్రో, నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌కు వ్య‌తిరేకంగా ప్ల‌కార్డులు ద‌ర్శ‌న మివ్వ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ ప‌దే ప‌దే జై శ్రీరామ్ నినాదం ఎత్తుకుంటుంటే.. మ‌మ‌త క‌ల‌క‌త్తా కాళీ నినాదం ఎత్తుకుంటున్నారు. అభివృద్ధితో పాటు సెంటిమెంట్ల‌ను కూడా మ‌మ‌త ప్ర‌యోగిస్తున్నారు. సో.. మొత్తానికి దీదీ వ్యూహంతో బీజేపీకి క‌ష్టాలు పెరిగాయ‌ని అంటున్నారు.. ఎన్నిక‌ల నాటికి.. దీదీ వ్యూహం మ‌రింత‌గా ప‌దునుతేలేలా ఉంది.