Begin typing your search above and press return to search.

కేకే మరణానికి బెంగాల్ ప్రభుత్వమే కారణం.. బీజేపీ సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   2 Jun 2022 9:31 AM GMT
కేకే మరణానికి బెంగాల్ ప్రభుత్వమే కారణం.. బీజేపీ సంచలన ఆరోపణలు
X
ప్రముఖ గాయకుడు కేకే మరణం దేశంలోని ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కోల్‌కతాలో మంగళవారం జరిగిన కాలేజీ ఈవెంట్‌లో ప్రదర్శన ఇచ్చిన తర్వాత 53 ఏళ్ల గాయకుడికి గుండెపోటు వచ్చింది.ఇప్పుడు ఆయన మరణం రాజకీయ రంగు పులుకుముంది. కేకే మరణం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది. అక్కడి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకొని ఆరోపణలు గుప్పిస్తుండడంతో బెంగాల్ ప్రభుత్వం ఇరుకునపడుతోంది.

ప్రతిపక్ష పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లోపాలను బీజేపీ ఎత్తిచూపుతోంది. ఈ విషయంలో నిష్పక్షపాత దర్యాప్తును డిమాండ్ చేస్తోంది.. బీజేపీకి అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘాటుగా సమాధానం ఇస్తోంది. "రాబందు రాజకీయాలను" ఆపాలని కోరుతోంది.

అధికారిక నివేదికల ప్రకారం.. మే 31న దక్షిణ కోల్‌కతాలోని నజ్రుల్ మంచాలో గురుదాస్ కళాశాల నిర్వహించిన సంగీత కచేరీలో ప్రదర్శన ఇచ్చిన తర్వాత కేకే తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. హోటల్‌కు చేరుకున్న తర్వాత అతను కుప్పకూలిపోయాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్చగా అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు.

కేకే నిర్వహిస్తున్న కచేరీకి సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ "కచేరీ వేదిక వద్ద దాదాపు 3000 మంది సీటింగ్ కెపాసిటీ మాత్రమే ఉందని, కానీ 7వేల మందికి అనుమతించారని.. పైగా అక్కడ ఏసీ కూడా లేదని.. కేకే చుట్టూ గుంపులుగా ఉన్నారని, అంటే వీఐపీకి సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని.. అదే అతడి మరణానికి కారణమైందని" ఆరోపించారు.

బీజేపీ ఆరోపణలను టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ తీవ్రంగా ఖండించారు. ఈ రాబందు రాజకీయాలను ప్రతిపక్ష పార్టీలు ఆపాలని కోరారు. కేకే మృతి దురదృష్టకరమని, అందుకు ప్రతి ఒక్కరూ విచారిస్తున్నారని అన్నారు. ఆయన మరణాన్ని బీజేపీ రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. కేకే తమ పార్టీకి చెందిన వ్యక్తి అని బీజేపీ ఆరోపించడం ప్రారంభించినట్లయితే ఆశ్చర్యం లేదని ఘోష్ ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రస్తుతం విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఇక గాయకుడు కేకే దీర్ఘకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక చెబుతోంది. ఈరోజు సమగ్ర నివేదికను పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది.