Begin typing your search above and press return to search.

ఫైనల్లో స్టోక్స్ ఆ నాలుగు పరుగులు వద్దన్నాడట!

By:  Tupaki Desk   |   17 July 2019 2:01 PM GMT
ఫైనల్లో స్టోక్స్ ఆ నాలుగు పరుగులు వద్దన్నాడట!
X
ప్రపంచకప్ ఫైనల్ చివరి ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌ మన్ బెన్ స్టోక్స్ పరుగు తీస్తూ డైవ్ చేయడం.. అతడి బ్యాటుకు తాకి ఓవర్ త్రోల రూపంలో నాలుగు పరుగులు అదనంగా రావడం ఇంగ్లాండ్‌ కు బాగా కలిసొచ్చిన సంగతి తెలిసిందే. 3 బంతుల్లో ఇంగ్లాండ్ 9 పరుగులు చేయాల్సి ఉండగా.. స్టోక్స్ రెండో పరుగు తీస్తుండగా గప్తిల్ వేసిన త్రోకు ఇలా జరిగింది. స్టోక్స్ తీసిన రెండు పరుగులకు - ఈ అదనపు 4 పరుగులు తోడై 6 పరుగులు వచ్చాయి. దీంతో 2 బంతుల్లో 3గా సమీకరణం తేలికైపోయింది. చివరికి ఈ మ్యాచ్ టై అయింది. ఇంగ్లాండ్‌ కు అన్యాయంగా 4 పరుగులు వచ్చాయని, లేదంటే న్యూజిలాండే ప్రపంచకప్ గెలిచేదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది.

ఐతే స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా బంతికి బ్యాట్ తాకించకపోయినప్పటికీ.. ఆ నాలుగు పరుగులు ఇంగ్లాండ్ స్కోరులో కలపొద్దని అంపైర్లను కోరాడట. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ టెస్టు బౌలర్ అండర్సన్ ఒక కాలమ్‌ లో వెల్లడించాడు. మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ద్వారా తనకీ విషయం తెలిసిందన్నాడు. అయితే అంపైర్లు మాత్రం.. నిబంధనల ప్రకారం బ్యాట్స్‌మన్ ఉద్దేశపూర్వకంగా బంతికి అడ్డం పడనప్పుడు ఆ పరుగులు జట్టు స్కోరులో కలుస్తాయని చెప్పి అతడి విన్నపాన్ని తిరస్కరించారట. ఇది నిజమైతే స్టోక్స్ జెంటిల్ మన్ అన్నట్లే.