Begin typing your search above and press return to search.

బెన్ స్టోక్స్.. సంచలన వీడియో బయటికి

By:  Tupaki Desk   |   28 Sep 2017 11:34 AM GMT
బెన్ స్టోక్స్.. సంచలన వీడియో బయటికి
X
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై కొంత కాలంగా క్రికెట్ ప్రపంచమంతా ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఇటు బ్యాటింగ్ లో.. అటు బౌలింగ్ లో అదరగొడుతూ ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడతను. ఐపీఎల్ లో ఏకంగా రూ.15.5 కోట్ల ధర పలకడమే కాక.. అందుకు తగ్గ ప్రదర్శన చేసి శభాష్ అనిపించుకున్నాడు. అతర్జాతీయ క్రికెట్లోనూ ఇలాగే మెరుపులు మెరిపిస్తున్నాడు. ఐతే ఆట పరంగా ఎంతో ఉన్నతంగా కనిపించే స్టోక్స్ కు వ్యక్తిగతంగా అంత మంచి పేరేమీ లేదు. తరచుగా తప్ప తాగి వివాదాల్లో చిక్కుకోవడం అతడికి అలవాటు. ఇంతకముందు రెండు మూడు సార్లు ఇలా అతిగా తాగి గొడవలు పడి.. పోలీస్ స్టేషన్లు వెళ్లిన సందర్భాలున్నాయి.

తాజాగా అతను మరింత శ్రుతి మించాడు. అతను వెస్టిండీస్ తో మూడో వన్డే ముగిసిన రోజు రాత్రి తన సహచరుడు అలెక్స్ హేల్స్ తో కలిసి తప్ప తాగి.. ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాడు. వాళ్లిద్దరూ సూట్లు వేసుకుని పెద్ద స్థాయి వ్యక్తుల్లాగే కనిపిస్తున్నారు. నిమిషం వ్యవధిలో స్టోక్స్ ఆ ఇద్దరిపై ఒకటి రెండు కాదు.. ఏకంగా 15 పిడిగుద్దులు కురిపించాడు స్టోక్స్. గాయపడ్డ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు స్టోక్స్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రంతా జైల్లోనే ఉండి మరుసటి రోజు బయటికి వచ్చాడు బెన్. ఈ విషయం తెలిసిన ఇంగ్లాండ్ బోర్డు స్టోక్స్ తో పాటు హేల్స్ ను కూడా నాలుగో వన్డే నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న పోలీసులు.. స్టోక్స్ బాధిత వ్యక్తులపై పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. దీంతో స్టోక్స్ ఎంతటి దుర్మార్గుడో అందరికీ అర్థమైంది. ఈ కేసులో నేరం రుజువైతే గరిష్టంగా ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. సాక్ష్యాలు పక్కాగా ఉన్న నేపథ్యంలో స్టోక్స్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. ఐతే స్టోక్స్ ఈ ఘటనపై తమ దేశ క్రికెట్ బోర్డుకు క్షమాపణలు చెప్పాడు. అతణ్ని ఇంగ్లాండ్ బోర్డు యాషెస్ సిరీస్ కు ఎంపిక చేసింది.