Begin typing your search above and press return to search.

డబ్బు కోసం 9 టీకాలు వేసుకున్న బెల్జియం కుర్రాడు ఎలా ఉన్నాడు?

By:  Tupaki Desk   |   24 Dec 2021 11:02 AM IST
డబ్బు కోసం 9 టీకాలు వేసుకున్న బెల్జియం కుర్రాడు ఎలా ఉన్నాడు?
X
కరోనాకు శ్రీరామరక్ష అని చెప్పే టీకాల్ని నమ్మే వారు ఎంతమందో.. నమ్మని వారు కూడా ఎక్కువే. ప్రాశ్చాత్య దేశాల్లోని వారితో పోలిస్తే.. మన దేశంలో టీకా విషయంలో కాస్తంత అప్రమత్తత ఎక్కువే. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి చెక్ చెప్పేందుకు వీలుగా రూపొందించిన వ్యాక్సిన్ ను వేసుకునేందుకుపలువురు ఏ మాత్రం ఇష్టపడని వైనం తెలిసిందే. అయితే.. ఇలాంటి వారికి ప్రాశ్చాత్య దేశాల్లో అక్కడి నిబంధనలు ఇబ్బందికి గురి చేస్తుంటాయి. అందుకే వారు బైపాస్ విధానాన్ని షురూ చేశారు.

వ్యాక్సిన్ వేసుకోవటం తప్పనిసరి అని తేల్చిన దేశాల్లో.. టీకా వేయించుకోవటం ఏ మాత్రం ఇష్టం లేని వారంతా తమకు బదులుగా వేరే వారిని టీకాలు వేయించుకునేలా సిద్ధం చేస్తారు. అతను టీకా వేసుకున్న తర్వాత.. అసలు టీకా వేయించుకున్నది తామేనని పేర్కొంటూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ పొందుతారు. ఈ దందా కొన్నిదేశాల్లో ఎక్కువగా ఉంటోంది. ఈ మధ్యనే యూరప్ దేశాల్లో ఒకటైన బెల్జియంలో ఒక కుర్రాడి మోసాన్ని అక్కడి అధికారులు గుర్తించారు. వ్యాక్సిన్ వేసుకోవటం ఇష్టం లేని వారికి బదులుగా తాను టీకా వేయించుకోవటం.. అందుకు ప్రతిఫలంగా డబ్బులు తీసుకోవటం చేసేవాడు.

తాజాగా అతడు మరోసారి ఇదే తరహాలో వేరే వారి పేరు మీద ఉన్న వ్యాక్సిన్ వేయించుకునే సందర్భంలో అక్కడి అధికారులు గుర్తించి.. అతడి బండారాన్ని బయటపెట్టేశారు. డబ్బుల కోసం తొమ్మిది సార్లు వ్యాక్సిన్ వేయించుకోవటమా? అంటూ షాక్ కు గురయ్యారు. ఇన్నిసార్లు వ్యాక్సిన్ వేసుకున్న ఆ కుర్రాడికి ఏమన్నా అవుతుందన్న భయంతో అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేసి.. పలు పరీక్షలు చేయించారు. ఇప్పటివరకు అతను ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు. ఒకే వ్యక్తి తొమ్మిది సార్లు వ్యాక్సిన్ వేసుకున్న నేపథ్యంలో.. అతడి శరీరంలో వచ్చే మార్పుల్ని తెలుసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో అతన్ని అబ్జర్వేషన్ లోనే కంటిన్యూ చేస్తున్నారు.