Begin typing your search above and press return to search.

మోడీకి మిత్రులు గుర్తుకొచ్చారు

By:  Tupaki Desk   |   19 July 2015 9:51 AM IST
మోడీకి మిత్రులు గుర్తుకొచ్చారు
X
తనకు తిరుగులేదన్న స్థితి నుంచి.. వరుస ఘటనలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రధాని మోడీకి ఒక్కసారి మిత్రులు గుర్తుకు వచ్చారు. సాధారణంగా మిత్రులంటే చాలు లైట్ తీసుకునే ఆయనకు.. తన మిత్రపక్షాలు హటాత్తుగా గుర్తుకు వచ్చిన పరిస్థితి. గత పదమూడు నెలల కాలంలో.. పార్లమెంటు సమావేశాల సందర్భంగా గుర్తుకు రాని మిత్రపక్షాలు మోడీ సర్కారుకు గుర్తుకు వచ్చాయి.

వ్యాపం కుంభకోసం.. లలిత్ మోడీ వ్యవహారం.. మహారాష్ట్రలో వెలుగు చూసిన చిక్కీ కుంభకోణంతో పాటు.. భూసేకరణ బిల్లు విషయంలో విపక్షాలు విరుచుకుపడేందుకు.. వర్షాకాల సమావేశాల్ని వేదికగా చేసుకునే ప్రయత్నం చేస్తూ.. కత్తులు నూరుతున్న వేళ.. మిత్రులు గుర్తుకు వచ్చారు. తొలిసారి ఎన్డీయే మిత్రపక్షాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

తాజా పరిణామం చూస్తే.. పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నప్పుడు మాత్రమే మోడీకి మిత్రులు గుర్తుకు వస్తారన్న అభిప్రాయం కలగక మానదు. పేరుకు ఎన్డీయే సర్కారు అన్న మాటే కానీ.. వన్ మ్యాన్ షో చేస్తున్న మోడీకి.. ఇప్పటికి కానీ మిత్రులు కనిపించని పరిస్థితి. అవసరమైన వేళ.. సాయానికి గుర్తుకొచ్చిన మోడీ వైఖరి పట్ల మిత్రపక్షాలు ఎలా స్పందిస్తాయో..?