Begin typing your search above and press return to search.

పాలు కంటే బీరు మేలట బాసు!

By:  Tupaki Desk   |   27 Oct 2016 5:46 PM GMT
పాలు కంటే బీరు మేలట బాసు!
X
పాలు తాగ‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు. చిన్నాపెద్దా అని వ‌యోభేదాలు లేకుండా ప్ర‌తీరోజూ పాలు తాగండి అని వైద్యులు కూడా స‌ల‌హా ఇస్తారు. అయితే, ఆరోగ్యానికి పాలు కంటే బీరు మంచిదంటూ అమెరికాలో పెటా ప్ర‌క‌ట‌న‌లు చెబుతున్నాయి! ఇదే విష‌యాన్ని స‌శాస్త్రీయంగా నిరూపించి మ‌రీ చెబుతున్నారు! అమెరికాలోని విస్కాసిన్ విశ్వ‌విద్యాల‌యానికి స‌మీపంలో ఉన్న ఒక మాల్ వ‌ద్ద ఈ ప్ర‌క‌ట‌న‌ను పెటా ఏర్పాటు చేసింది. ఆరోగ్యానికి పాలు తాగ‌డం కంటే, బీరు తాగ‌డ‌మే ఎన్నో రెట్టు మంచిద‌ని పేర్కొంది. అంతేకాదు, పాలూ బీరులో ఉన్న పోష‌క ప‌దార్థాల‌ను విడివిడిగా పోల్చుతూ బీరు గొప్ప‌త‌నాన్ని వివ‌రించింది. పోష‌క ప‌దార్థాల రీత్యా చూసుకునే బీరే గొప్ప‌ద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో నిరూపించింది!

పాలు వ‌ల్ల కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. స్థూల‌కాయం, మ‌ధుమేహం, కేన్స‌ర్ వంటి రోగాల‌కు పాల వ‌ల్ల‌నే ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌! అంతేకాదు, మిల్క్ ప్రాడెక్ట్స్ అధికంగా వాడితే మ‌న శ‌రీరంలోని ఎముక‌ల ప‌టుత్వం త‌గ్గిపోయి, గుల్ల‌బారిపోయే ప్ర‌మాదం ఉంద‌నీ పెటా చెబుతోంది. అందుకే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌నుకునేవారు పాలు మానుకోండీ, బీరు వాడుకోండీ అంటూ స‌ద‌రు ప్ర‌క‌ట‌నలో పేర్కొంటున్నారు.

నిజానికి, ఇలా బీరుకి భారీ మ‌ద్ద‌తు ఇస్తూ గ‌తంలోనే ఓసారి పెటా ప్ర‌చారం చేసింది. అయితే, ఆ సంద‌ర్భంలో ఈ ప్ర‌చారంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఇప్పుడు పాల ఉత్ప‌త్తుల‌కు ప్ర‌త్యామ్నాయంగా బీరు వాడాలంటూ ప్ర‌చారానికి దిగారు. పాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డం కోసం ల‌క్ష‌లాది గోవుల‌ను ఇబ్బందుల‌కు గురి చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పెటా చెబుతోంది. ఆరోగ్యం కోసం పాలు కంటే బీరు మంచిదైన‌ప్పుడు... అంద‌రూ బాధ్య‌తాయుతంగా బీరు తాగాల‌ని చెబుతోంది. ప‌రిమిత మోతాదులో ఆల్క‌హాల్ మంచిదే అంటున్నారు! మ‌రి, ఈ తాజా ప్ర‌చారంపై ఎలాంటి వ్య‌తిరేక‌త‌లు వ్య‌క్తమౌతాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/