Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ గెలిచినంత సులువు కాదు ప్రధాని మంత్రిత్వం.. ఇమ్రాన్ ఖాన్ దిగిపోవడం ఖాయం

By:  Tupaki Desk   |   30 March 2022 10:36 AM GMT
ప్రపంచ కప్ గెలిచినంత సులువు కాదు ప్రధాని మంత్రిత్వం.. ఇమ్రాన్ ఖాన్ దిగిపోవడం ఖాయం
X
ఆ కళ్లలో కసి.. ఆ ఆటలో దమ్ము.. నాయకుడంటే అతడే అనేలా.. సరిగ్గా 30 ఏళ్ల క్రితం (1992 మార్చి 25) పాకిస్థాన్ ను వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిపాడు ఇమ్రాన్ ఖాన్. నిజంగానే 1992 ప్రపంచ కప్ లో ఇమ్రాన్ పోరాట పటిమ అద్భుతం. లీగ్ దశలో దాదాపు కప్ నుంచి నిష్క్రమించే పరిస్థితుల్లో ఉన్న పాకిస్థాన్ ను విజేతగా నిలపడం కేవలం ఇమ్రాన్ నాయకత్వానికే సాధ్యమైంది. అందుకే నాడు ప్రపంచమే అతడికి సలాం కొట్టింది. బద్ధ శత్రువైన భారత్ లోనూ ఇమ్రాన్ నాయత్వానికి ప్రశంసలు దక్కాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. నాడు భారత కెప్టెన్ గా ఉన్న అజహరుద్దీన్ కంటే.. ఇమ్రాన్ కే భారత్ లో అభిమానులు ఎక్కువగా ఉండేవారు. 1992 ప్రపంచ కప్ విజయం అనంతరం ఇమ్రాన్ భారత్ లో పర్యటిస్తే అద్భుత స్పందన లభించింది. ముఖ్యంగా నాటి అమ్మాయిలైతే ఇమ్రాన్ లుక్స్ కు పడిపోయారు. వారికి అతడో గ్రీకు వీరుడల్లే కనిపించాడు.

ఆ వెంటనే రాజకీయాల్లోకి

1992 ప్రపంచ కప్ విజయం అనంతరం లభించిన క్రేజ్ తో ఇమ్రాన్ 1996లో పాకిస్థాన్ రాజకీయాల్లోకి వచ్చాడు. తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పేరిట పార్టీని స్థాపించాడు. అంతకుముందు ప్రపంచ కప్, క్రికెట్ ద్వారా తాను సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని తల్లి పేరిట కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించి నిజమైన హీరో అనిపించుకున్నాడు. 1995లో బ్రిటీష్ జాతీయురాలు జెమీమా గోల్డ్ స్మిత్ ను వివాహం చేసుకున్నాడు. వాస్తవానికి ప్రపంచ కప్ విజయం ఊపులో రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ గెలిచేస్తాడనేంత వేవ్ కనిపించింది. అతడి ర్యాలీలకు జనాలు లక్షలాదిగా పోటెత్తారు.

తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ పార్టీ 1997 నుంచి ప్రతి జాతీయ ఎన్నికల్లోనూ పోటీచేస్తోంది. 207 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీలో 1997లో ఆయన పార్టీ కేవలం ఒక్కసీటే గెలిచింది. 2002 ఎన్నికల్లోనూ అలాగే మట్టికరిచింది. 2008-13 మధ్య పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా ఉన్న అసిఫ్‌ అలీ జర్దారీ హయాంలో ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయింది. ఇదే సమయంలో ఇమ్రాన్‌ పార్టీ పుంజుకుంది. 2013 ఎన్నికల్లో 35 సీట్లు గెలుచుకుంది. ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సులో అధికారాన్ని చేజిక్కించుకుంది. చివరకు 2018 జూలైలో జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. ఇమ్రాన్ ను అతడి చిరకాల కోరిక అయిన ప్రధాని పదవి వరించింది.

342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీలో..

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులుంటారు. అందులో 272 మందిని నేరుగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. 60 స్థానాలు మహిళలకు, పది స్థానాలు మతపరంగా అల్పసంఖ్యాక వర్గాలకు కేటాయించారు. 5% పైగా ఓట్లు వచ్చిన పార్టీలకు దామాషా పద్ధతిన స్థానాలు కేటాయించి, వీరిని ఎంపిక చేస్తారు. మొత్తం 172 స్థానాలు సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఏకైక అతిపెద్ద పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 137 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నేరుగా ఎన్నికై ఉండాలి.

ప్రధాని పదవి పోయినట్లేనా..?

1987లోనే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇమ్రాన్ ను పిలిచి మరీ కెప్టెన్సీ అప్పగించి 1992 ప్రపంచ కప్ నకు పంపింది పాక్ క్రికెట్ బోర్డు. దానిని వమ్ము చేయకుండా అతడు కప్ ను సాధించిపెట్టాడు. ఇలాగే బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ పాలనలతో విసిగిపోయిన పాక్ ప్రజలు ఇమ్రాన్ పార్టీకి అధిక సీట్లిచ్చారు. ఆయనను ప్రధానిగా ఎన్నుకున్నారు. కానీ, మైదానంలో క్రికెట్ ఆడినంత సులువు కాదు రాజకీయాలంటే. అందులోనూ పాకిస్థాన్ రాజకీయాలంటే సైన్యంతో పెనవేసుకున్నవి. కాబట్టే ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమూ అక్కడ నిలవలేదు. ఇందుకుతగ్గట్లే ఇప్పుడు ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, పాలనా వైఫల్యాలు తోడూ ఇమ్రాన్‌ ఖాన్‌ కష్టాల్లో పడ్డారు. జాతీయ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార 'పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌' (పీటీఐ) ప్రధాన మిత్ర పక్షమైన ముతాహిదా ఖుయామి మూమెంట్‌ పాకిస్థాన్‌(ఎంక్యూఎం-పీ) గట్టి షాకిచ్చింది.

ప్రతిపక్ష పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ)కి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ జాతీయ అసెంబ్లీలో మెజార్టీ కోల్పోయినట్లైంది. ''ప్రతిపక్షాల కూటమితో ఎంక్యూఎం ఓ ఒప్పందానికి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడిస్తాం'' అని పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారి మంగళవారం రాత్రి ట్విటర్‌లో ప్రకటించారు. ఈ మధ్యాహ్నం ఎంక్యూఎం పార్టీకి చెందిన మంత్రులు, సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ బలం మరింత తగ్గనుంది. పాక్‌ సంకీర్ణ ప్రభుత్వంలో పీటీఐకి ప్రధాన మిత్ర పక్షం ఎంక్యూఎంపీనే. ఈ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు ఇప్పటివరకు ప్రభుత్వానికి మద్దతుగా ఉండటంతో పాటు మంత్రులుగానూ కొనసాగుతున్నారు.

అయితే ఇప్పుడు ఎంక్యూఎంపీ ప్రతిపక్షానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం మెజార్టీ మార్క్‌ను కోల్పోనుంది. ఎంక్యూఎంపీ సభ్యులు రాజీనామా చేస్తే ఇమ్రాన్‌ ప్రభుత్వ బలం 164కు తగ్గుతుంది. అదే సమయంలో ప్రతిపక్షాల బలం 176కు పెరగనుంది. ఇక అధికార పీటీఐ పార్టీకి చెందిన 24 మంది సభ్యులు కూడా ఇమ్రాన్‌పై తిరుగుబాటుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 31న చర్చ జరగనుంది. ఏప్రిల్‌ 3 ఆదివారం దీనిపై ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ప్రస్తుత బలాబలాలు చూసుకుంటే ఇమ్రాన్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాసం నెగ్గేలానే కన్పిస్తోంది. 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ తన బలాన్ని నిరూపించుకోవాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం.

రాజీనామా తప్పదా..?

తాజా పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం పార్లమెంట్ వెలుపల ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావొద్దని పార్టీ సభ్యులకు ఇమ్రాన్‌ సూచనలు చేశారు. ఈ మేరకు 'పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌' సభ్యులకు పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.