Begin typing your search above and press return to search.

అందుకే కేసీఆర్ అంటే షా సైతం అలెర్ట్ అవుతారట

By:  Tupaki Desk   |   2 Nov 2019 6:53 AM GMT
అందుకే కేసీఆర్ అంటే షా సైతం అలెర్ట్ అవుతారట
X
మొండితనం ఎంత ఎక్కువో అంతకు మించిన అప్రమత్తత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కవన్న మాటను ఆయన సన్నిహితులు పదే పదే ప్రస్తావిస్తుంటారు.పాలన విషయాన్ని పెద్దగా పట్టించుకోకున్నా.. పార్టీ నేతల కదలికల మీద నిఘా విషయాన్ని మాత్రం ఏ రోజుకు ఆ రోజు మానిటర్ చేస్తారని చెబుతారు. తనకు షాకిచ్చే ప్రయత్నించే నేతల ప్లాన్ల మీద నిఘా కళ్లను వేసే ఆయన.. తనకు తెలీకుండా వెనుక ఎవరేం చేస్తున్నారన్న విషయం మీద ఆయన పెట్టే శ్రద్ధ అంతా ఇంతా కాదంటున్నారు.

ఈ అప్రమత్తతే కేసీఆర్ కు శ్రీరామరక్షగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఏపీలోని రాజ్యసభ సభ్యుల్ని తమ పార్టీలో విలీనం చేసుకున్న తరహాలోనే తెలంగాణలోని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల చేత చేయించాలని బీజేపీ అధినాయకత్వం భావించిందట. ఇందుకోసం ఇప్పటికే ప్లాన్ వర్కవుట్ చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రాజ్యసభలో టీఆర్ఎస్ కు ఆరుగురు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. వారిలో సంతోష్ ఇంటి మనిషి. కేసీఆర్ ను కలలో కూడా మోసం చేయాలన్న ఆలోచన కూడా రానోడు. మరో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు. ఆయన కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. వరంగల్ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ కెప్టెన్ ఇంట్లోనే కేసీఆర్ సేద తీరుతారంటే.. ఆయనకున్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి అనుబంధం ఉన్న ఆయన కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చే అవకాశం లేదు.

ఈ నేపథ్యంలో తాము అనుకున్న ప్లాన్ ను వర్క్ వుట్ చేసుకునేందుకు టీఆర్ఎస్ సీనియర్ నేత కేకేకు వల విసిరినట్లు తెలిసిందే. ఇందుకోసం టీఆర్ఎస్ తో అంటీముట్టనట్లుగా ఉండే ఆ పార్టీ ఎంపీ డి. శ్రీనివాస్ ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే.. అనుక్షణం తమ పార్టీ నేతలు ఎవరేం చేస్తున్నారన్న విషయాన్ని అధికార.. అనధికార నిఘా వర్గాల్ని వినియోగించుకొని అప్డేటెడ్ గా ఉండే కేసీఆర్.. షా బ్యాచ్ వేస్తున్న ప్లాన్ కు సంబంధించిన టిప్ తెలుసుకున్నారట.

కేకేకు రాజ్యసభ పదవీ కాలం ముగుస్తున్న వేళ.. దాన్ని రెన్యువల్ చేసే ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే.. షా శిబిరం వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేసిన కేసీఆర్.. టీఆర్ఎస్ ఎంపీలు కమలనాథులతో కలిసిపోకుండా అడ్డుకున్నట్లు చెబుతున్నారు. టీడీపీని ఏ రీతిలో అయితే బీజేపీలో విలీనం చేశారో.. అదే రీతిలో తెలంగాణ అధికారపక్షాన్ని విలీనం చేయాలని ప్లాన్ చేసినా వర్క్ వుట్ కాలేదంటున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు షాక్ తగిలేలా ఫలితం వస్తే వెంటనే మరోసారి తమ ప్లాన్ వర్క్ వుట్ చేయాలనుకున్నారని.. అయితే అందుకు భిన్నమైన ఫలితం రావటంతో ప్రస్తుతానికి షా టీం కామ్ అయినట్లు తెలుస్తోంది. బాబును దెబ్బ తీసినంత ఈజీగా కేసీఆర్ కు షాకివ్వటం అంత తేలికైన విషయం కాదన్న విషయాన్ని షా టీం అర్థం చేసుకున్నట్లు సమాచారం.