Begin typing your search above and press return to search.

తాజా తీర్పుతో ఆ మీడియా సంస్థకు సుడి తిరిగినట్లే!!

By:  Tupaki Desk   |   18 July 2020 10:00 AM IST
తాజా తీర్పుతో ఆ మీడియా సంస్థకు సుడి తిరిగినట్లే!!
X
రోజులన్ని ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడూ మంచి ఉండదు. అలా అని ఎప్పుడూ దరిద్రపుగొట్టు రోజులే ఉండవు. గడిచిన కొద్ది కాలంగా ప్రముఖ మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ సంస్థ ఆర్థికంగా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఆ సంస్థకు ప్రతికూల పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటివేళ.. సదరు సంస్థకు ఊరటనిచ్చే తీర్పు ఒకటి బయటకు వచ్చింది.

దీంతో.. డీసీ సుడి తిరిగిపోయినట్లేనన్న మాట మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకూ జరిగిందేమిటన్నది చూస్తే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అదేనండి ఐపీఎల్ లోని తొలి ఎనిమిది జట్లల్లో ఒకటి డెక్కన్ చార్జర్స్. దీని యజమాని ప్రముఖ మీడియా సంస్థ అయిన డెక్కన్ క్రానికల్. ఇదిలా ఉంటే 2012లో ఐపీఎల్ గవర్నరింగ్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన తర్వాత సదరు ఫ్రాంచైజీని రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం ఏ మాత్రం చట్టబద్ధత లేదని వాదించటమే కాదు.. చట్ట వ్యతిరేకమంటూ ముంబయికోర్టు మెట్లను ఎక్కింది. దీనిపై విచారణను పూర్తి చేసిన సదరు ఉన్నత న్యాయస్థానం.. తాజాగా తీర్పు కాపీలో ఉన్న అంశాల్ని ప్రస్తావించారు. బాంబే హైకోర్టు పేర్కొన్న దాని ప్రకారం ఫ్రాంచైజీ రద్దు చట్ట విరుద్ధమని డెక్కన్ క్రానికల్ వాదించింది. తాజాగా ఇదే విషయాన్ని బాంబే హైకోర్టు బలపర్చింది. అంతేకాదు.. రూ.4800 కోట్ల మొత్తాన్ని ఈ ఏడాది సెప్టెంబరు నాటికి చెల్లించాలని పేర్కొంది. తాజా పరిణామాలపై బీసీసీఐ ఇప్పటివరకూ స్పందించింది లేదు. కోర్టు తీర్పుపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కోర్టు చెప్పినట్లే బీసీసీఐ కానీ చేస్తే.. డీసీ యాజమాన్యానికి సుడి తిరిగినట్లుగా పలువురు అభివర్ణిస్తున్నారు.