Begin typing your search above and press return to search.

రోహిత్ ని ఎంపిక చేయక పోవడానికి కారణమదే : బీసీసీఐ

By:  Tupaki Desk   |   29 Oct 2020 8:00 PM IST
రోహిత్ ని ఎంపిక చేయక పోవడానికి కారణమదే : బీసీసీఐ
X
ఐపీఎల్ టోర్నమెంట్ ముగియగానే భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. నవంబర్ 26 నుంచి షెడ్యూల్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టు కోసం సునీల్ జోషి ఆధ్వర్యంలోని కొత్త సెలక్షన్ కమిటీ సోమవారం సమావేశమై వన్డేలు, టెస్టులు, టీ ట్వంటీ లకు జట్లను ఎంపిక చేసింది. అయితే ఈ మూడు ఫార్మాట్లలో తొడ కండరాల సమస్యతో బాధపడుతున్న రోహిత్ శర్మ పేరు లేకపోవడంతో దుమారం చెలరేగింది. క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు రోహిత్ శర్మ పేరు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు రోహిత్ శర్మ గాయం తీవ్రత ఏ రేంజ్ లో ఉంది. అతడి పరిస్థితి ఏమిటో కూడా కనీసం తెలియజేయకుండా మూడు ఫార్మాట్లకు అతన్ని ఎంపిక చేయకపోవడంపై భారీగా విమర్శలు చెలరేగాయి.

గాయపడ్డ మయాంక్ అగర్వాల్, నవదీప్ సైనీ లకు అవకాశం కల్పించిన సెలెక్టర్లు రోహిత్ ను పక్కన పెట్టడంతో అతడి పై కుట్ర జరుగుతోందని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ గాయం నుంచి కోలుకున్నాడంటూ.. రోహిత్ శర్మ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు బీసీసీఐ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడ కండరాల గాయం అంత తీవ్రంగా ఉంటే రోహిత్ నెట్స్ లో ప్రాక్టీస్ ఎలా చేయగలడని సునీల్ గవాస్కర్ కూడా ప్రశ్నించడంతో ఈ వ్యవహారం పై మరిన్ని విమర్శలు చెలరేగాయి.

మాజీ ఆటగాళ్లు, అభిమానుల నుంచి విమర్శలు తాకిడి ఎక్కువవడంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. టీమిండియా ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ఇచ్చిన రిపోర్టు కారణంగానే సెలెక్టర్లు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఆస్ట్రేలియా టూర్ కు జట్లను ఎంపిక చేసే ముందు ఆటగాళ్ళ ఫిట్ నెస్ కు సంబంధించిన నివేదిక ఇవ్వాలని భారత సెలక్షన్ కమిటీ నితిన్ పటేల్ ను ఆదేశించిందని అతడు రోహిత్ శర్మ ఫిట్నెస్ రిపోర్టులో కనీసం రెండు నుంచి మూడు వారాల విశ్రాంతి అవసరమని పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ కారణంగానే జట్ల ఎంపికలో రోహిత్ శర్మ పేరును పరిగణనలోకి తీసుకోలేదని ఆ అధికారి చెప్పారు. రోహిత్ శర్మ గాయం పై ఇద్దరు వైద్యులు ఇచ్చిన సర్టిఫికేట్ ని ఫిజియో సమర్పించగా.. అందులో ఇద్దరు వైద్యులు రోహిత్ శర్మకు రెండు నుంచి మూడు వారాల విశ్రాంతి అవసరమని సూచించారన్నారు. ఫిజియో సూచనల మేరకే రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లకు ఎంపిక చేయలేదని ఆ అధికారి చెప్పారు.