Begin typing your search above and press return to search.

ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు భార్యలు.. ప్రియురాళ్ల‌ను ఏం చేద్దాం

By:  Tupaki Desk   |   28 July 2020 11:00 AM IST
ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు భార్యలు.. ప్రియురాళ్ల‌ను ఏం చేద్దాం
X
పొట్టి క్రికెట్‌.. అన్ని దేశాల ఆట‌గాళ్లు ఆడే క్రికెట్ టోర్న‌మెంట్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్). ఎట్ట‌కేల‌కు ఈ టోర్న‌మెంట్ నిర్వ‌హ‌ణ‌పై ఓ క్లారిటీ వ‌చ్చింది. ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు యూఏఈలో ఏర్పాట్లు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త ఆట‌గాళ్లు కూడా ఆ టూర్‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) దీనికోసం నియ‌మ‌నిబంధ‌న‌లు రూపొందిస్తోంది. ఈ క్ర‌మంలో కొన్ని ష‌ర‌తులు విధిస్తోంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే వైర‌స్ వ్యాప్తి ఉన్న నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోనుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)పై సమాలోచనలు చేస్తోంది. లీగ్‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తోంది. ఆటగాళ్ల రక్షణ కోసం ఏర్పాటు చేయబోయే జీవ భద్రత వలయంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఈ క్ర‌మంలో ఆటగాళ్ల సతీమణులు, ప్రియురాళ్లను తీసుకురావాలా వ‌ద్దా అని యోచిస్తోంది. ప్రొటోకాల్‌ పరిస్థితుల్లో అనుమతి నిరాకరించాలా అనే అంశాన్ని బోర్డు భావిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఫ్రాంచైజీల నుంచి భిన్నవాదనలు వచ్చినట్లు తెలిసింది. కొన్ని ఫ్రాంచైజీలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ప్రేక్షకులు లేకుండానే టోర్న‌మెంట్ జ‌రుగుతుండ‌డంతో ఆటగాళ్లతో కనీసం కుటుంబసభ్యుల్ని అనుమతించాలని చెబుతున్నాయి. వారిని బుడగలోకి తెస్తే రెండు, మూడేళ్లున్న పిల్లల సంరక్షణ ఎలా? షాపింగ్‌, సంద‌ర్శ‌నీయ స్థ‌లాలు అంటూ తిరిగితే ఎలా అని మ‌రికొన్ని ప్ర‌శ్నిస్తున్నాయి.

సాధారణ టైమ్‌లో ప్లేయర్లతో పాటు వారి భార్యలు, ప్రియురాళ్ల‌ను నిర్ణీత స‌మ‌యంలో అనుమతి ఉండేది. ఇప్పుడు పరిస్థితులు బాగా లేవు. వ్యాధి ముప్పు పొంచి ఉంది. ఈ సంద‌ర్భంగా బీసీసీఐ స‌మాలోచ‌న‌లు చేస్తోంది. కుటుంబ‌స‌భ్యుల‌‌ను అనుమతిస్తే వారిని హోటల్ గ‌దుల‌‌కే పరిమితం చేయాలా? మూడు నాలుగేళ్ల చిన్న పిల్లలు ఉంటే వారిని ఎలా? పైగా రెండు నెలల పాటు వాళ్లను గదిలోనే ఉంచడం సాధ్యమా అని ఫ్రాంచైజీల నిర్వాహ‌కులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై త్వరలోనే బోర్డు నిర్ణయం తీసుకొని స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను 8 ఫ్రాంచైజీలకు జారీ చేయనుంది.

ప్రస్తుతం అతిథులు రానివ్వకుండా ఫైవ్ స్టార్స్ హోటళ్లు మొత్తాన్ని జ‌ట్ల కోసం బుక్ చేయడం సాధ్యమా? అన్ని ఫ్రాంచైజీలకు ఆ స్థోమత ఉందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి ప్ర‌త్యామ్నాయంగా త్రీ స్టార్ హోటళ్లు, చిన్న రిసార్ట్‌లను బుక్ చేసుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు. జ‌ట్టు బస్సులను నడిపే లోకల్ డ్రైవర్లు, క్యాటరింగ్ స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బందిని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా క‌ట్ట‌డి చేయ‌నున్నారు. వాళ్లందరికీ రోజు వైద్య ప‌రీక్ష‌‌లు నిర్వహించాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఎస్‌ఓపీలో బీసీసీఐ క్లారిటీ ఇస్తుందని ఆశిస్తున్నాయి. ఈ టోర్న‌మెంట్‌కు సంబంధించి బీసీసీఐ నుంచి తమకు ఓ లెటర్ కూడా అందిందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సోమవారం తెలిపింది.