Begin typing your search above and press return to search.

విదేశీ ఆటగాళ్లకు .. బీసీసీఐ భరోసా..!

By:  Tupaki Desk   |   27 April 2021 4:30 PM GMT
విదేశీ ఆటగాళ్లకు .. బీసీసీఐ భరోసా..!
X
ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. రోజుకు దాదాపు మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా వేల సంఖ్యలో ఉంటున్నాయి. తొలుత మహారాష్ట్ర, ఢిల్లీకే పరిమితమైన కరోనా.. రాను రాను అన్ని రాష్ట్రాలకు పాకింది. ప్రస్తుతం మన దేశపరిస్థితిపై అంతర్జాతీయ సమాజం సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

ఇదిలా ఉంటే ఇటువంటి భయానక వాతావరణంలోనూ ఐపీఎల్​ కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా లాంటి దేశాలు.. తమ దేశ క్రికెటర్లను తిరిగి స్వదేశానికి వచ్చేయాలని సూచించాయి. ప్రస్తుతం భారత్​కు చెందిన విమానాలపై ఆస్ట్రేలియా తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇప్పటికే దేశానికి చెందిన కొందరు క్రికెటర్లు ఐపీఎల్​ ను వీడి వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం ఇక్కడే ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా,భారత్​ విమానాలపై ఆంక్షలు విధించడంతో ఐపీఎల్​ లో ఉన్న విదేశీ ఆటగాళ్లకు భయం పట్టుకున్నది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లల్లో ఆందోళన మొదలైది.

భారత్​లో పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము సొంత దేశాలకు ఎలా వెళ్లాలంటూ వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ విదేశీ ఆటగాళ్లకు భరోసా ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్​ ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు ఆందోళన చెందొద్దని.. వాళ్లను ఇంటికి చేర్చేవరకు బీసీసీఐ బాధ్యత తీసుకుంటుందని భరోసా ఇచ్చింది. భారత్​ లో కరోనా కేసులు పెరుగుతున్న దశలో ఐపీఎల్​ నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు దేశంలోని కోవిడ్​ బాధితులు ఆక్సిజన్ దొరకక అల్లాడుతుంటే రూ. వేల కోట్లు ఖర్చుపెట్టి ఐపీఎల్​ నిర్వహించడం అవసరమా? అంటూ కొందరు క్రికెటర్లు వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ క్రమంలో బీసీసీఐ మాత్రం సంచలన ప్రకటన చేసింది. ఐపీఎల్​ జరిగి తీరుతుందని స్పష్టం చేసింది.విదేశీ ఆటగాళ్లకు అన్ని విధాలా అండగా ఉంటామని.. అవసరమైతే ఆయా దేశాల ఉన్నతాధికారులతో చర్చిస్తామని పేర్కొన్నది. మరోవైపు కరోనాకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఐపీఎల్​ నిర్వహిస్తున్నామని మరోసారి స్పష్టం చేసింది. విదేశీ ఆటగాళ్లు ధైర్యంగా ఉండాలని సూచించింది.