Begin typing your search above and press return to search.

జగన్ 'బీసీ' దెబ్బ.. టీడీపీ చాప చుట్టేసినట్టే

By:  Tupaki Desk   |   8 March 2020 3:30 AM GMT
జగన్ బీసీ దెబ్బ.. టీడీపీ చాప చుట్టేసినట్టే
X
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైపోయింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో దక్కిన ఘోర పరాజయానికి బదులు తీర్చుకునేందుకు విపక్ష టీడీపీ... అధికార వైసీపీపై తనదైన రేంజిలో వ్యూహాలను రచిస్తోంది. టీడీపీ పన్నుతున్న ఈ వ్యూహాలకు 50 శాతానికి మించి రిజర్వేషన్లు కుదరవన్న హైకోర్టు తీర్పు ఓ బ్రహ్మాండమైన అస్త్రంగా దొరికిందనే చెప్పాలి. అయితే ఈ బ్రహ్మాస్త్రాన్ని కూడా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలి పాశుపాతాస్త్రంతో తుత్తునీయలు చేశారనే చెప్పాలి. జగన్ వదిలిన ఈ బాణానికి టీడీపీ ‘బీసీ’ అస్త్రం ప్రయోగానికి ముందే విఫలం కాగా... ఎన్నికల్లో టీడీపీ దాదాపుగా చాప చెట్టేయక తప్పని పరిస్థితి నెలకొందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటిదాకా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కుతుండగా... జగన్ అనుసరించిన వ్యూహంతో ఆ రిజర్వేషన్లు కాస్తా 24కు కుంచించుకుపోయాయని, ఇదేనా బీసీలపై వైసీపీకి ఉన్న ప్రేమ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా ఆయన తన పార్టీ నేతలతో ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. అయితే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ ప్రారంభం కాకముందే... జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు హైకోర్టు ఆదేశాల మేరకు దక్కుతున్న 24 శాతం రిజర్వేషన్లతో పాటు జనరల్ కేటగిరీలో అదనంగా బీసీలకు 10 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు.

అంటే... జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎప్పటిలాగే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ప్రకారం సీట్లు దక్కినట్టేనన్న మాట. అయితే ఈ సీట్లు మిగిలిన పార్టీలు అమలు చేసే పరిస్థితి అంతగా కనిపించడం లేదు. బీసీలకు తగ్గిన 10 శాతం మేర సీట్లను పార్టీ తరఫున సీట్ల కేటాయింపులో భర్తీ చేస్తానని జగన్ ప్రకటించారు. అంటే... బీసీలకు ఈ ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఒక్క వైసీపీలోనే దక్కుతాయన్న మాట. మరి ఎన్నికల్లో వైసీపీని కార్నర్ చేయాలంటే... టీడీపీ కూడా హైకోర్టు చెప్పిన 24 శాతం సీట్లతో పాటుగా పార్టీ తరఫున జనరల్ కేటగిరీకి దక్కే స్థానాల్లో 10 శాతం సీట్లను బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అయ్యే పని కాదన్న మాట టీడీపీలోనే వినిపిస్తోంది. రాజ్యాంగం కల్పించిన మేరకు రిజర్వ్ డ్ కేటగిరీకి ఏనాడూ కేటాయించని టీడీపీ.. ఇప్పుడు జగన్ చెప్పినట్లుగా పార్టీ తరఫున బీసీలకు 10 శాతం కేటాయిస్తుందా? అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మొత్తంగా బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ అనుభవ రాహిత్యం ఫలితమేనన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడాలన్న టీడీపీ వాదనను... జగన్ ఒక్క దెబ్బతో తుత్తునీయలు చేశారని చెప్పాలి. అయినా కోర్టు చెప్పిన 24 శాతం సీట్లతో పాటుగా పార్టీ తరఫున మిగిలిన పది శాతం సీట్లను బీసీలకు కేటాయించడం ద్వారా... బీసీలకు న్యాయం చేసిన పార్టీగా వైసీపీని జగన్ నిలిపినట్టే. జగన్ కొట్టిన ఈ దెబ్బకు టీడీపీ ఆత్మరక్షణలో పడిపోవడమే కాకుండా... సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయేందుకు రంగం సిద్ధమైపోయిందన్న కోణంలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. మరి జగన్ కొట్టిన ఈ దెబ్బ ఫలితంగా టీడీపీ ఏ మేర నష్టపోతుందన్న విషయం స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తే గానీ తేలదు.