Begin typing your search above and press return to search.

బుర్ఖా నిషేధించాల‌ని పార్ల‌మెంటులో బిల్లు

By:  Tupaki Desk   |   23 Feb 2017 4:41 AM GMT
బుర్ఖా నిషేధించాల‌ని పార్ల‌మెంటులో బిల్లు
X
అమెరికాలో ఏడు దేశాలకు చెందిన వలసదారులు - శరణార్థులను తాత్కాలికంగా నిషేధించాలని ట్రంప్‌ సర్కార్‌ గతనెల 27న కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా పంథాలోనే పయనించాలని బవేరియా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాని నిషేధించాలని బవేరియా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఓ బిల్లును రూపొందించి పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బుర్ఖా ధరించి విధులకు హాజరు కావద్దనే ఆంక్షలు విధించాలని భావిస్తోంది. అంతేగాకుండా, ముస్లిం మహిళలు రద్దీ ప్రదేశాల్లో బుర్ఖా ధరించి వెళ్లొద్దనే నిబంధనలు తీసుకొచ్చేందుకు సన్నద్ధమౌతోంది.

బవేరియా క్యాబినెట్‌ సమావేశం జరిగిన అనంత‌రం ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి జోచిమ్‌ హెర్మన్‌ స్థానిక మీడియాతో మాట్లాడారు. ముస్లిం మహిళల బుర్ఖా నిషేధానికి పార్లమెంట్‌ లో బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. బవేరియా ప్రభుత్వ నిర్ణయాన్ని మెజారిటీ నెటిజన్లు విమర్శించగా - పలువురు సమర్థించారు. కాగా, బుర్ఖా ధరించి ప్రభుత్వ మహిళా ఉద్యోగులు - మహిళా న్యాయమూర్తులు విధులకు హాజరు కావద్దని జర్మనీ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ డ్రాఫ్ట్‌ బిల్లును కూడా రూపొందించింది. అయితే, జర్మనీ తీసుకున్న నిర్ణయాన్ని ఆదేశ అంతర్గత వ్యవహారాల మంత్రి థామస్‌ డీ మైజీర్‌ సైతం వ్యతిరేకించారు. ఇలాంటి నిబంధనలతో అసహన భావాలు పెరిగిపోవడమే కాకుండా, పౌర హక్కులకు భంగం వాటిల్లుతుందని ధ్వజమెత్తారు. పైగా, పలువురు ముస్లిం మహిళా ఉద్యోగులు స్థానిక న్యాయస్థానాలను ఆశ్రయించి దావా వేశారు. ఈ అంశానికి సంబంధించిన కేసులు పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

ఇదిలా ఉండగా, గతేడాది జూన్‌ లో ఓ ముస్లిం మహిళా లా స్టూడెంట్‌ హిజాబ్‌ తో ( ముస్లిం మహిళలు ముఖానికి ధరించే పై వస్త్రం) కళాశాలకు వెళ్లడాన్ని ఆ కళాశాల యాజమాన్యం తప్పుపట్టింది. హిజాబ్‌ ను తొలగించాలని ఆ విద్యార్థిని ఆదేశించింది. దీంతో, యాజమాన్య చర్యలను వ్యతిరేకించిన ఆ విద్యార్థిని స్థానిక కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం లా కాలేజ్‌ యాజమాన్య చర్యలను తప్పుపట్టింది. హిజాబ్‌ ధరించి కళాశాలకు వెళ్లే స్వేచ్ఛ ముస్లిం విద్యార్థులకు ఉందని తీర్పులో పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/