Begin typing your search above and press return to search.

బాక్సైట్ బాటలో మావోయిస్టుల వేట

By:  Tupaki Desk   |   26 Oct 2016 8:37 AM GMT
బాక్సైట్ బాటలో మావోయిస్టుల వేట
X
ఏవోబీలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ వెనుక అనేక కారణాలున్నాయని వినిపిస్తోంది. చాలాకాలంగా మావోయిస్టు కార్యకలాపాలు లేకపోయినా కూడా ఇంత దారుణంగా నిద్రిస్తున్నవారిని చంపాల్సిన అవసరం ఏంటని విప్లవ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు... విశాఖ మన్యం బాక్సైట్ తవ్వకాలను మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నందునే అగ్రనేతలను హతమార్చేందుకు కుట్ర పన్నారంటున్నారు. బాక్సైట్ తవ్వాకాలపై గత ఏడాది ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేసింది... అంతేకాదు.. తవ్వకాల వ్యవహారం నుంచి వెనక్కుతగ్గింది. కానీ... అదంతా తెరముందు జరిగినదని... తెర వెనుక భారీ వ్యూహం రచించి ఏడాదిగా దాని అమలుకు ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికి సఫలమయ్యారని చెబుతున్నారు.

గతేడాది విశాఖ మన్యంలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మావోయిస్టులు జనాన్ని చైతన్యపరిచారు. టీడీపీ నేతలను కిడ్నాప్ చేశారు. ఆ క్రమంలోనే ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అయితే... ఎలాగైనా బాక్సైట్ తవ్వకాలజరపాలన్న ఉద్దేశంతో మావోయిస్టుల అడ్డు తొలగించుకునేందుకు ప్రణాళిక రచించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏఓబిలో మావోయిస్ట్‌ ల ఉనికిని పూర్తిగా తుడిచివేయడానికి ఏడాది కిందటే పోలీస్ ఉన్నతాధికారులు స్కెచ్ వేశారని చెబుతున్నారు. అయితే... విషయం డిపార్టుమెంట్ లో కొందరికే తెలుసని... దిగువ స్థాయి అధికారులకు తెలియకుండా ఉన్నతాధికారులు జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. ఆంధ్ర - ఒడిశా పోలీస్ అధికారులకు మాత్రమే విషయాన్ని తెలిసి - వ్యూహాత్మకంగా మావోలపై దాడులకు దిగారని పోలీసు వర్గాలే అంటున్నాయి.

దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ ఎన్‌ కౌంటర్‌ లో 28 మంది చనిపోవడానికి పోలీసు ఉన్నతాధికారులు పక్కా వ్యూహమే కారణమని తెలుస్తోంది. గత ఏడాది విశాఖలో పోలీస్ ఉన్నతాధికారులు కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఆంధ్ర - ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఏఓబిలో ఆపరేషన్ గ్రీన్ హంట్‌ ను మావోయిస్ట్‌ లు వ్యతిరేకిస్తున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను చేపట్టడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దీన్ని మావోయిస్ట్‌ లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త వ్యూహంతో మావోలపై దాడులకు దిగాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. ఈ బాధ్యతను గ్రేహౌండ్స్ మాజీ డిజి - సిఆర్‌ పిఎఫ్ డైరక్టర్ జనరల్ దుర్గాప్రసాద్ చేపట్టినట్టు తెలుస్తోంది. దుర్గాప్రసాద్ ఏడాది కాలంగా ఏఓబిలో మావోయిస్ట్ కార్యకలాపాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మావోయిస్ట్‌ లు కదలికలతోపాటు - కొత్త రిక్రూట్‌ మెంట్‌ లు - ఆయుధ సేకరణ - ఎప్పుడెప్పుడు - ఎక్కడెక్కడ మావోలు సమావేశాలు నిర్వహిస్తున్నారన్న సమాచారాన్ని కూలంకషంగా సేకరించారు. ముంచింగిపుట్ - కోరాపుట్ మధ్య ఉన్న కటాఫ్ ఏరియాలో మావోలు సమావేశమవుతారన్న విషయం పోలీసు ఉన్నతాధికారులకు ముందుగానే సమాచారం అందింది. దీంతో ఆపరేషన్ చేపట్టారు. మరోవైపు సోమవారం జరిగిన భారీ ఎన్‌ కౌంటర్‌ కు మావోయిస్ట్‌ ల్లోని కోవర్టులే కారణమని తెలిసింది. వీరి సహకారంతోనే గ్రేహౌండ్స్ బలగాలు కటాఫ్ ఏరియాలోకి ప్రవేశించినట్టు సమాచారం. కోవర్టులే లేకపోతే - గ్రేహౌండ్స్ బలగాలు అక్కడ అడుగు పెట్టలేవన్నది తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/