Begin typing your search above and press return to search.

జోకర్.. తుపాకీ రాముడంటూ ఏసుకున్న భట్టి

By:  Tupaki Desk   |   28 Jan 2016 4:51 AM GMT
జోకర్.. తుపాకీ రాముడంటూ ఏసుకున్న భట్టి
X
గ్రేటర్ ఎన్నికల ప్రచారం మొదలై.. టీఆర్ ఎస్.. బీజేపీ.. టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం షురూ అయినా.. కాంగ్రెస్ పెద్దగా మాటల తూటాల్ని పేల్చలేదనే చెప్పాలి. తెలంగాణ అధికారపక్షంపై టీ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది లేదనే చెప్పక తప్పదు. ఆ లోటును తీరుస్తూ తాజాగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన.. కేటీఆర్ ను జోకర్ గా.. తుపాకి రామునిగా అభివర్ణించటం విశేషం.

సీమాంధ్రుల్ని నోటికి వచ్చినట్లుగా తిట్టేసిన కేసీఆర్.. కేటీఆర్ లు ఇప్పుడు వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నేతల పేరు ఉచ్చరించటానికి అసహ్యించుకున్న కేసీఆర్.. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం వారిపై ప్రేమ కురిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ నేతలు గెలిస్తే.. గ్రేటర్ లోని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తారని.. జాగో..బాగో నినాదాలతో తమ నిజస్వరూపాల్ని నెలరోజుల్లోనే చూపిస్తారంటూ భట్టి హెచ్చరించారు.

కాంగ్రెస్ హయాంలో నగరానికి తాము గోదావరి నీళ్లు తీసుకొస్తే.. వాటిని నెత్తిన జల్లుకొని గోదావరినీళ్లను తామే తెచ్చినట్లుగా బిల్డప్ ఇచ్చారంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అధికారపక్షం మీద ఇంత ఆగ్రహాన్ని కడుపులో పెట్టుకున్న భట్టి.. ఇంతకాలం ఎందుకు కామ్ గా ఉన్నట్లు? ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రచారం చేయలేదెందుకు..?