Begin typing your search above and press return to search.

బాబోయ్ బాబర్.. పరుగుల దండయాత్ర

By:  Tupaki Desk   |   9 Jun 2022 11:30 AM GMT
బాబోయ్ బాబర్.. పరుగుల దండయాత్ర
X
103,66,105*,114,57,67 & 55,36 & 196,36 ఇవేమీ లాడ్జి నంబర్లు కావు.. వాహనాల రిజిస్ట్రేషన్ల నంబర్లు కావు.. ఇంకేదైనా నంబర్లూ కావు.. ఓ బ్యాట్స్ మన్.. అదీ అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల వరుసగా చేసిన పరుగులు. జాగ్రత్తగా గమనించండి.. వీటిలో ఎక్కడా వైఫల్యం లేదు. ఒక్కటి మినహా.. అన్నీ ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టుపై చేసిన పరుగులే. అందులోనూ ఓ జట్టుకు సారథ్యం వహిస్తూ చేసినవి. ఆ జట్టు కూడా నిలకడైనదేమీ కాదు. అలాంటి టీమ్ కు ఆడుతూ.. కెప్టెన్సీ చేస్తూ, అవసరమైతే ఓపెనింగ్ కు దిగుతూ.. చేసిన స్కోర్లివి. అంటే.. ఆ బ్యాట్స్ మన్ ఎంతటి గొప్ప ఫామ్ లో ఉండాలి? అసలు ఎంత గొప్ప ఫామ్ లో ఉన్నా.. ఏ ఆటగాడికైనా ఇన్ని పరుగులు, ఇంత నిలకడగా చేయడం అసాధ్యం. కానీ, పాకిస్థాన్ సారథి బాబర్ ఆజామ్ దీనిని సుసాధ్యం చేస్తున్నాడు. అందరిచేత ఔరా బాబర్ అనిపించుకుంటున్నాడు.

నిలకడ అతడి ఇంటిపేరు...

క్రికెటర్ల కుటుంబంలో పుట్టిన బాబర్.. అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం టాప్ బ్యాట్స్ మన్. టి20 ల్లో దూకుడుగా ఆడగలడు.. వన్డేల్లో సంయమనంతో నిలవగలడు.. టెస్టుల్లో పాతుకుపోనూ గలడు. అందుకే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అతడే నంబర్ వన్. తాజాగా బుధవారం రాత్రి వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. దీంతో హ్యాట్రిక్ కొట్టాడు. గతంలోనూ ఓసారి హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఘనత అతడి సొంతం. అది కూడా కెరీర్ ప్రారంభంలోనే సాధించాడు. పాకిస్థాన్ కు చాలా మ్యాచ్ ల్లో ప్రాతినిధ్యం వహించిన క్రమాన్ అక్మల్, ఉమర్ అక్మల్ ఇతడికి కజిన్స్. ప్రతిభావంతులైన అక్మల్ సోదరుల ప్రస్థానం వివాదాలు, క్రమశిక్షణా రాహిత్యంతో మరుగునపడింది. బాబర్ మాత్రం ఎదురే లేదన్నట్లు దూసుకెళ్తున్నాడు.

పాక్ క్రికెట్ ను నిలబెట్టింది అతడే..

దాదాపు మూడేళ్ల కిందట 24 ఏళ్ల బాబర్ కు పాక్ క్రికెట్ పగ్గాలప్పగిస్తే అందరూ నోరెళ్లబెట్టారు. అప్పటికి ఆ జట్టు తీవ్ర సంక్షోభంలో ఉంది. కానీ, బాబర్ సమర్థంగా జట్టును నడిపించాడు. గతేడాది టి20 ప్రపంచ కప్ లో అతడి సారథ్యంలోనే పాక్ మెరుగైన ప్రతిభ చాటింది. ప్రపంచ కప్ లలో ఎప్పుడూ భారత్ పై గెలవని లోటును కూడా తీర్చుకుంది. పాకిస్థాన్ క్రికెట్ జహీర్ అబ్బాస్, జావేద్ మియాందాద్, ఇంజమాముల్ హక్, యూసుఫ్ యొహానా, యూనిస్ ఖాన్ వంటి ఎందరో గొప్ప బ్యాట్స్ మెన్ ను చూసింది. కానీ, వారందరి కంటే బాబరే అత్యుత్తమం అంటున్నారు ఇప్పుడు. అతడు ఇదే ఫామ్ ను కొనసాగిస్తే మరిన్ని పరుగులు ఖాతాలో చేరడం ఖాయం. ఎందుకంటే బాబర్ వయసు ఇంకా 27 ఏళ్లే. అంటే మరో పదేళ్ల క్రికెట్ ఆడగలడు.

కోహ్లి రికార్డును కొట్టేశాడు..

బుధవారం వెస్టిండీస్ తో మ్యాచ్ లో సెంచరీ ద్వారా బాబర్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ 17 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. అజామ్‌ ఇప్పుడు దాన్ని 13 ఇన్నింగ్సుల్లోనే పూర్తి చేశాడు. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో అతడు 103 పరుగులు సాధించి ఈ కొత్త రికార్డు సృష్టించాడు.

ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్‌ 18 ఇన్నింగ్స్‌ల్లో మూడో స్థానంలో నిలవగా.. కేన్‌ విలియమ్సన్‌ 20 ఇన్నింగ్స్‌, అలిస్టర్‌ కుక్‌ 21 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి తర్వాతి స్థానాల్లో నిలిచారు. మరోవైపు బాబర్‌ వన్డేల్లో రెండోసారి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో శతకాలు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇది వరకు 2016లో ఇదే వెస్టిండీస్‌ జట్టుపై యూఏఈలో 120, 123, 117 పరుగులు సాధించిన అతడు.. ఈ ఏడాది ఆస్ట్రేలియాపై 114, 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తాజాగా విండీస్‌పైన మరో శతకం బాది సత్తా చాటాడు.

నంబర్ వన్ అతడేనా?

కోహ్లి పరుగులకు ఇబ్బంది పడుతున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఫామ్ లో లేడు. రూట్ నిలకడగా ఆడుతున్నా.. ఇంగ్లండ్ టి20 జట్టు సభ్యుడు కాదు. ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ ఇటీవల పూర్తిగా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో ఆడుతూ.. టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నది బాబర్ ఒక్కడే. ఈ లెక్కన చూస్తే అతడే ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ అనడంలో సందేహం లేదు.