Begin typing your search above and press return to search.

ఈసారిచ్చే బతుకమ్మ చీరలు అదిరిపోతాయట!

By:  Tupaki Desk   |   20 Sep 2019 4:57 AM GMT
ఈసారిచ్చే బతుకమ్మ చీరలు అదిరిపోతాయట!
X
పోయిన చోటే వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని నూటికి నూరు పాళ్లు అమలు చేసే అతి కొద్దిమంది ప్రభుత్వాధినేతల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. ఏదైనా పథకం అమల్లో కష్టం వచ్చినా.. దాని కారణంగా బోలెడన్ని తలనొప్పులు వచ్చినా ఆయన వెనక్కి తగ్గరు. తానేం అనుకున్నారో అది పూర్తి చేసేలా.. తుది ఫలితం దక్కే వరకూ ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా ఆయన విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు.

తాజాగా అలాంటిదే చోటు చేసుకోనుందన్న మాట వినిపిస్తోంది. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబడుచులకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టటం తెలిసిందే. మొదటి రెండు సంవత్సరాలు బతుకమ్మ చీరల రచ్చ అంతా ఇంతా కాదు. ఈ చీరల పంపిణీ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు.. నాణ్యత బాగోలేదని తెలంగాణ మహిళలు ప్రభుత్వాన్ని ఉద్దేశించి నానా బూతులు తిట్టటమే కాదు.. కొన్ని చోట్ల కాల్చేశారు కూడా.

ఇలాంటివి వరుస పెట్టి చోటు చేసుకున్నప్పుడు.. మనకెందుకులేరా రిస్క్ అన్నట్లు సదరు పథకానికి ప్రాధాన్యత తగ్గించేస్తుంటారు. అలా చేస్తే ఆయన కేసీఆర్ కారు కదా? ఈ ఏడాది బతుకమ్మ పండగ సందర్భంగా పంపిణీ చేసే చీరల కోసం భారీ కసరత్తునే చేశారు. ఇదే విషయాన్ని కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా తామీసారి పంపిణీ చేసే చీరల్ని శాంపిల్ గా బొమ్మలకు కట్టి ప్రదర్శించారు.

మహారాష్ట్ర నుంచి తెప్పించిన అరవై రూపాయిల చీరల్ని మా ముఖాన కొడతారా? అంటూ మొదటి సంవత్సరం తిట్టిన మహిళల చేత వావ్ అనిపించేలా.. ఈసారి చీరలు ఉంటాయన్నట్లుగా తాజా ప్రోగ్రామ్ జరిగింది. వంద శాతం పాలిస్టర్ ఫిలమెంట్ కాటన్ చీరల్ని వంద విభిన్న రంగుల్లో జరీ అంచుతో తయారు చేయించామని.. పెద్ద వయసు మహిళల కోసం ప్రత్యేకంగా 9 మీటర్ల చీరల్ని పది లక్షలు ప్రత్యేకంగా చేయించినట్లుగా చెప్పారు.

గతంలో రూ.60కి రూ.70 లేదంటే వంద లోపు మాత్రమే విలువ చేస్తాయన్న విమర్శలు అందుకున్న బతుకమ్మ చీరల గురించి మరో విషయాన్ని కేటీఆర్ చెప్పేశారు. ఈసారి పంపిణీ చేసే చీరలు చాలా ఖరీదైనవన్న విషయాన్ని ఆయన తన మాటల్లో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.02 కోట్ల మంది అర్హులైన మహిళలకు చీరల్ని అందించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఏకంగా రూ.313 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. అంటే.. కాస్త అటూ ఇటూగా రూ.300 తగ్గకుండా ప్రతి చీర ఉంటుందన్న విషయాన్ని కేటీఆర్ చెప్పేశారు.

కోటి చీరల ఆర్డర్ ఇచ్చినప్పుడు సహజంగానే ధర తక్కువకు లభిస్తుంది. తాజాగా చూపించిన చీరల్ని చూస్తే.. బహిరంగ మార్కెట్లో తక్కువలో తక్కువ రూ.600 నుంచి రూ.700 మధ్యలో ఉండే క్వాలిటీతో ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. బతుకమ్మ చీరల పంపిణీ కారణంగా 16 వేల మంది మరమగ్గాల కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. అంతేకాదు గతంలో వారి నెలసరి ఆదాయం రూ.8వేలనుంచి రూ.12వేల వరకూ ఉంటే.. బతుకమ్మ చీరల కారణంగా వారి నెల ఆదాయం రూ.16వేల నుంచి రూ.20వేలకు పెరిగినట్లు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ మహిళల మదిని దోచేలా తయారు చేసినట్లు చెప్పటమే కాదు.. చూపించిన శాంపిల్ చీరల మాదిరే పంపిణీ చీరలు ఉంటే మాత్రం.. ఈసారి ప్రోగ్రామ్ సూపర్ హిట్ ఖాయమంటున్నారు.