Begin typing your search above and press return to search.

డెట్రాయిట్లో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు

By:  Tupaki Desk   |   5 Oct 2016 4:28 AM GMT
డెట్రాయిట్లో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు
X
(అక్టోబర్ 8న డెట్రాయిట్లో జరుగనున్న దసరా మరియు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా “డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ” మరియు “తెలంగాణ జాగృతి” తో కాసేపు..)

ప్రతీ సంవత్సరం లాగానే ఈ సారి కూడా డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ భారీగా బతుకమ్మ - దసరా ఉత్సవాలని జరిపేందుకు సర్వం సంసిద్ధం చేసుకున్నది. భారీగా తరలి వచ్చే జన సందోహం - వారికి ఉచితంగా భోజన - పార్కింగ్ సదుపాయాలతో - భారీ బతుకమ్మ - సంప్రదాయ కార్యక్రమాలతో డెట్రాయిట్లో జరిగే ఈ వేడుకలు ఏటా ప్రత్యేకంగా నిలుస్తాయ్. పది సంవత్సరాలుగా విజయవంతంగా ఈ వేడుకలని జరుపుతూ - ఈ పదకొండో సంవత్సరం మహోత్సవాన్ని ఎలా జరుపనున్నారనే విషయాలని డెట్రాయిట్ తెలంగాణా కమ్యూనిటీ మరియు తెలంగాణ జాగృతితో ముచ్చటించడం జరిగింది.

ప్రెసిడెంట్ భుజంగ రావు గారు - చైర్మన్ రాం గోపాల్ ఉప్పల గార్లు డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ మీడియా ప్రతినిధి కృష్ణ చైతన్య అల్లంతో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఏ రకంగా సమస్యలని పరిష్కరించబోతున్నారు - అంచనాలని ఏ రకంగా అందుకోబోతున్నారో వివరించారు.

అల్లం: గత రెండు నెలలుగా మీరు పడుతున్న శ్రమ గురించి తెలిసింది. ఈ విలువైన సమయాన్ని కేటాయించినందుకు కృతఙ్ఞతలు. ఇంత భారీ స్థాయిలో వేడుకలని జరుపడం ఎలా సాధ్యం అవుతుంది?

భుజంగరావు(అద్యక్షులు): డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో దగ్గర ఉన్న అనేక మంది మిత్రులూ - ప్రతినిధులూ - అనేక సంఘాలతో స్నేహ పూరిత సంబంధాలు ఉండడం వల్ల డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ జరిపే ప్రతీ వేడుక మనందరిదీ అని భావిస్తారు. తెలుగు వారే కాకుండా - తెలుగేతర భారతీయులు కూడా వేడుకల్లో పాలుపంచుకోవడం మా మీద అదనపు బాధ్యతని ఉంచుతుంది. ఇంత భారీగా చేయాలంటే ఆర్ధిక వనరుల కొరత ఉన్నప్పటికీ పరాయి గడ్డ మీద తెలంగాణ సాంస్కృతిక జండా ఎగురేయడం అనేది చారిత్రిక అవసరం అని భావిస్తాం.

అల్లం: గత సంవత్సరం అనుకున్నదానికన్నా ఎక్కువగా వేలకు పైగా కార్యక్రమానికి హాజరై పార్కింగ్ సరిపోక ఇబ్బందులు పడ్డారని విన్నాం. ఈ సంవత్సరం ఏ ఏర్పాట్లు చేస్తున్నారు?

రాం గోపాల్(చైర్మన్): నిజమే. పార్కింగ్ కన్నా ముందు గమనించాల్సింది మరొక విషయం ఉంది. అప్పుడు నిర్దిష్టంగా కొన్ని వందల మందికి మాత్రమే చిరు భోజన/డిన్నర్ సదుపాయాలు చేశాం. వేల సంఖ్యలో వచ్చారు. హాల్ నిండి పోయింది. పార్కింగ్ లేదు. భోజనాలు ఎలా పెట్టాలో అర్ధం కాలేదు. ఎంత మంది వస్తున్నారో అంచనా వేసి వెంట వెంటనే భోజన సదుపాయాల్లో మార్పులు చేసి అదనంగా వంటలు చేయించి - అదనపు ఖర్చుకు వెనుకాడకుండా విజయవంతంగా - లోపభూయిష్టంగా వేడుకలు జరిపాం. అదనపు భారాన్ని మీద వేసుకుని మోసిన బోర్డు మెంబర్లు - ట్రస్టీలు - దాతలు అందరికీ కృతఙ్ఞతలు. ఎంత కష్టం అయినా వెనుకాడని బోర్డు మెంబర్ల చొరవ - ఆది నుంచీ సహాయం అందించే దాతల వల్లనే ఇదంతా సాధ్యం అయింది. ఈ సారి మాత్రం ఏ ఇబ్బందులూ లేకుండా ఈ సంవత్సరం పార్కింగ్ కోసం ప్రత్యేక ఉచిత షటిల్ సర్వీస్ నడుపుతున్నాం. సేఫ్టీ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ టీంని కూడా ఏర్పాటు చేశాం.

అల్లం: తెలంగాణ జాగృతి తో మీ సాన్నిహిత్యం గురించి చెప్తారా?

భుజంగ రావు: జాగృతి ఎన్నారై కన్వీనర్ డెట్రాయిట్ విభాగం శ్రీధర్ బండారు గారు మొదటి నుండీ మాకు ఆప్తులు. ఎపుడు ఏం కావాలన్నా వెంటనే సహాయ సహకారాలు అందిస్తారు. శ్రీధర్ గారి చొరవ వల్ల, జాగృతి అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల కవిత గారు కూడా మాకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపి, మాకోసం వీడియో తయారు చేసి పంపిస్తారు. గత సంవత్సరం మా దశాబ్ది ప్రత్యేక సంచిక “బతుకమ్మ” ని ముద్రించినపుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు మాకు ముందు మాట రాసి ప్రోద్బలం అందించడం మాకు సంతోషం ఇవ్వడమే కాక ప్రోత్సాహాన్ని ఇచ్చింది. శ్రీ బాల్క సుమన్ గారు ఇండియా నుండి ప్రత్యేకంగా విచ్చేసి సంచికని ఆవిష్కరించారు. ఇంకా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయ సహకారాలకు ఎన్ని కృతఙ్ఞతలు చెప్పినా తక్కువే.

అల్లం: వారధులై మీరు చేస్తున్న పని ప్రశంసనీయం. వాడకో సంఘం ఏర్పడింది ఈ మధ్యన. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చబడదా?

రాం గోపాల్: మాకు ఎవరితో విభేదాలు లేవు. మరొక సంఘం తెలంగాణ సాంస్కృతిక వ్యాప్తి చేస్తుందని సంతోషంగా ఉంటుంది. అందరితో స్నేహంగానే ఉంటాం. ఎన్నో ఏళ్ళుగా నడిపిస్తూ, కార్యక్రమాలు చేస్తున్న అనుభవం ఉంది కాబట్టి కొత్తగా చేసేవాళ్ళు ఎవరికీ సాయం కావాలన్నా కూడా చేస్తాం. ముఖ్యంగా గ్రేటర్ డెట్రాయిట్ ఏరియాలో ఉన్న తెలుగు వారి సంఖ్యని బట్టి ఎన్ని సంఘాలు ఉన్నా అందరూ మనవారే. అందరితో సఖ్యంగా ఉంటున్నామా, వేడుకల పరమార్ధం అర్ధం చేసుకుని సాంస్కృతిక వారసత్వాన్ని నిలువరిస్తూ అందరికీ పండుగల విలువలని పంచుతున్నామా లేదా అనేదే ముఖ్యం.

అల్లం: గొప్ప మాట చెప్పారు. ప్రతీ ఏడూ లాగే ఈ సంవత్సరం కూడా వేడుకలు విజయవంతం కావాలని ఆశిస్తూ.. మీ సమయం కేటాయించినందుకు మరొక సారి కృతఙ్ఞతలు.

భుజంగ రావు: తప్పకుండా. ఆది నుండీ ప్రోత్సాహం అందిస్తున్న ప్రింట్, ఆన్లైన్, టీవీ మీడియా ప్రతినిధులకు కృతఙ్ఞతలు. మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాం.

- కృష్ణ చైతన్య అల్లం (మీడియా ప్రతినిధి – డెట్రాయిట్ తెలంగాణా కమ్యూనిటీ & తెలంగాణ ఎన్నారై జాగృతి (డెట్రాయిట్))