Begin typing your search above and press return to search.

క్యారీ బ్యాగ్ దెబ్బ‌!.. బాటాకు బాగానే త‌గిలింది!

By:  Tupaki Desk   |   21 April 2019 5:00 PM IST
క్యారీ బ్యాగ్ దెబ్బ‌!.. బాటాకు బాగానే త‌గిలింది!
X
భారీ డిస్కౌంట్లు - బంప‌ర్ ఆఫ‌ర్లు అంటూ వినియోగ‌దారుల‌ను బాగానే ఆకర్షిస్తున్న షాపింగ్ మాల్స్‌.. క‌నప‌డ‌ని దోపిడీని కూడా భారీ ఎత్తునే సాగిస్తున్నాయ‌ని చెప్పాలి. ప్రైమ్ ఏరియాల్లో సువిశాల స్థ‌లంలో బడా బిల్డింగ్‌ లు - ఇట్టే ఆక‌ట్టుకునే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో త‌న‌మైన శైలి కొత్త బిజినెస్ ను ప్రారంభించేసిన మాల్స్‌... లాభాల ఆర్జ‌న‌లోనూ కొత్త కొత్త దారుల‌ను వెతుకుతున్నాయి. అయితే ఆక‌ర్ష‌ణ‌ల‌కు లోనై షాపింగ్ మాల్స్ లోకి అడుగుపెడుతున్న వినియోగ‌దారులు వాటిని క‌నిపెడుతున్నా... కిమ్మ‌న‌కుండానే వెళ్లిపోతున్న ప‌రిస్థితి. అయితే ఎవ‌రికో ఒక‌రికి ఈ న‌యా దందాపై కాలుతుంది క‌దా. అలా కాలిన ఓ వినియోగ‌దారుడు ఏకంగా కోర్టుకు ఎక్క‌డంతో ఇప్పుడు షాపింగ్ మాల్స్ కు భారీ పంచ్ ప‌డింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ పంచ్ కార‌ణంగా షాపింగ్ మాల్స్ దారికి వ‌స్తాయా? అన్న అంశాన్ని ప‌క్క‌న‌పెడితే... ఈ వినియోగ‌దారుడు సాధించిన విజ‌యం మాత్రం భ‌విష్య‌త్తులో ఏ కొత్త దందాను ప్ర‌యోగించాల‌న్నా... షాపింగ్ మాల్స్ ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచించి తీసుకోక త‌ప్పని ప‌రిస్థితిని క‌ల్పించిద‌నే చెప్పాలి. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... షాపింగ్ మాల్స్ పార్కింగ్ పేరుతో పెద్ద ఎత్తున వినియోగ‌దారుడి జేబుకు చిల్లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో త‌మ వ‌ద్ద కొనుగోలు చేసిన వ‌స్తువుల‌ను తీసుకెళ్లేందుకు ఇస్తున్న క్యారీ బ్యాగ్ ల‌ను కూడా ఉచితంగా ఇచ్చేందుకు మాల్స్ ససేమిరా అంటున్నాయి. తొలుత ఈ బ్యాగ్స్ ను ఉచితంగానే ఇచ్చిన మాల్స్‌... త‌ర్వాత వాటికి కూడా ధ‌ర‌ను వ‌సూలు చేయ‌డం ప్రారంభించాయి. ఈ ధ‌ర రూ.5 నుంచి మొద‌లై ఏకంగా రూ.25 దాకా ఉంటోంది. ఈ క్ర‌మంలో ఓ మాల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ వినియోగ‌దారుడు అందులోని బాటా షోరూంలో ఏదో కొన్నాడు. దానిని ప‌ట్టుకెళ్లేందుకు బాటా బ్రాండ్ ప్ర‌క‌ట‌న‌ల‌తో నిండిన క్యారీ బ్యాగ్ ను ఇచ్చి దానికి రేటు వ‌సూలు చేసింది.

దీంతో భ‌గ్గుమ‌న్న స‌ద‌రు వినియోగ‌దారుడు ఏకంగా బాటాపై కోర్టుకెక్కాడు. ఆస‌క్తి క‌లిగించిన ఈ కేసును విచారించిన కోర్టు... బాటాకు బాగానే బుద్ధి చెప్పింది. మీ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు రాసి ఉన్న క్యారీ బ్యాగ్ ద్వారా ఫ్రీ ప‌బ్లిసిటీ పొందుతూ.... అదే బ్యాగ్ ను ఎలా వి-క్ర‌యిస్తార‌ని ప్ర‌శ్నించింది. అంతేకాకుండా ఈ దందా వినియోగ‌దారుల‌ను దోపిడీ చేసేదేన‌ని తేల్చేసి... క్యారీ బ్యాగ్ ధ‌ర‌తో పాటు వినియోగ‌దారుడికి కోర్టు కేసుకు అయిన ఖ‌ర్చును కూడా చెల్లించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు చాలా చిన్న‌దిగానే క‌నిపిస్తున్నా.. ఇక‌పై బ్రాండెడ్ వ‌స్తువుల‌ను అమ్మే సంస్థ‌ల‌తో పాటు షాపింగ్ మాల్స్ కూడా త‌మ ఆదాయాన్ని పెంచుకునే క్ర‌మంలో ఇక‌పై ఏ కొత్త దందాను అమ‌ల్లోకి తేవాల‌న్నా... కాస్తంత లోతుగానే ఆలోచించక త‌ప్ప‌దు. మొత్తంగా బాటాకు కోర్టులో త‌గిలిన దెబ్బ... ఇత‌ర బ్రాండ్స్‌, మాల్స్ కు కూడా త‌గిలేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది.