Begin typing your search above and press return to search.

తన బయోపిక్ తీస్తున్న వైసీపీ ఎంపీ... జనవినోదమేనా...?

By:  Tupaki Desk   |   22 Aug 2022 4:30 PM GMT
తన బయోపిక్ తీస్తున్న వైసీపీ ఎంపీ... జనవినోదమేనా...?
X
రాజకీయాల్లో ఉన్న వారు, పదవులు అందుకున్న వారు ప్రజల కోసం పనిచేయాలి. వారి మేలు కోసం పాటుపడాలి. ఎంపీ వంటి బాధ్యాతయుతమైన పదవులలో ఉన్న వారు తమ ప్రాంతానికి అయిదేళ్లలో ఎంత మంచి పని చేశామన్నది ఆలోచించాలి. కానీ వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి మరీ సొంత వ్యవహారలో నిండా మునిగితేలుతున్నారు. దాంతో జనానికి కావాల్సినంత వినోదం అందుతోంది. అదే టైమ్ లో ఓటేసి ఎన్నుకున్నందుకు ఇదా మాకు అన్న విషాదం కూడా కనిపిస్తోంది.

ఇప్పటికే సోషల్ మీడియా స్టార్ గా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్ ఉన్నారు. వారి మీద వచ్చిన ట్రోల్స్ కానీ మీంస్ కానీ లెక్కలేని విధంగా ఉన్నాయి. ఇలా తన పోకడలతో కామెడీని పంచుతున్నామన్న ఆలోచన కూడా లేకుండా మిగిలిన నాయకులు కూడా ఇదే వరసలో సోషల్ మీడియా స్టార్స్ కావాలని చూస్తున్నారు. లేటెస్ట్ గా జగన్ మంత్రివర్గంలో యువ మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే ఏకంగా ఫోటో షూట్ పెట్టేశారు.

ఆయన వివిధ ఫోజులలో ఫోట్ షూట్ చేసి సోషల్ మీడియాకు కావాల్సినంత వినోదం పంచేశారు. ఇపుడు మరో నేత వంతు. ఆయన ఎవరో కాదు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఆయన ఇపుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారూ వీరూ ఎందుకు అన్నట్లుగా ఏకంగా తన జీవిత చరిత్రను తానే ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనను అమలులో పెట్టేశారు. దాన్ని సొంత బ్యానర్ మీదనే నిర్మిస్తున్నారు.

ఆ బ్యానర్ పేరు సురేఖా ప్రొడక్షన్స్. ఇక ఈ మూవీలో కాస్టింగ్ ని టెక్నీషియన్స్ ని కూడా అపుడే సెలెక్ట్ చేశారు అని అంటున్నారు. ఈ మూవీలో అగస్త్య నక్షత్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్యాం కె నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేయనున్నారని తెలుస్తోంది. నందిగం సురేష్ సోదరుడు నిర్మాతగా నిర్మిస్తున్నా ఈ సినిమా కధ మీడియా కధనం ప్రకారం చూస్తే రాజకీయ అంశం కాదని అంటున్నారు.

ఒక దళిత యువకుడు కష్టపడి ఉన్నత స్థానానికి ఎలా చేరుకున్నారు అన్నదే కధాశం. ఇక నందిగం సురేష్ జగన్ కంట్లో పడడం, ఆయన ఏకంగా ఎంపీగా చాన్స్ ఇవ్వడం గెలవడం ఇవన్నీ కూడా ఈ మూవీలో చూపించబోతున్నారు. ఒక క్లైమాక్స్ లో జగన్ సీఎం అయినట్లుగా చూపించి ముగిస్తారు అని అంటున్నారు.

సరే మూవీ ఒకే. కానీ బయోపిక్ తీయడం అన్న దాని మీదనే చర్చ వస్తోంది. ప్రజలు అప్పగించిన బాధ్యతలు ఉన్నాయి. ఎంపీగా చేయాల్సింది ఉంది. వాటిని పక్కన పెట్టి ఈ ఫోటో షూట్లు ఏంటి ఈ బయోపిక్స్ ఏంటి అన్నదే సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్స్. దానికి జవాబులు కూడా అక్కడే దొరుకుతున్నాయి. డబ్బు ఉంది, అధికారం ఉంది. అందుకే ఇలాంటివి చేస్తున్నారు అని అంటున్నారు.

మొత్తానికి వినోదానికి మాత్రం ఏ మాత్రం కొరత‌ లేకుండా ఒకరి తరువాత ఒకరు వైసీపీ నేతలు ఇలా ముందుకు వచ్చి రంజింపచేస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా మరెంతమంది వైసీపీ నేతలకు మరెన్ని కొత్త ఆలోచనలు పుడతాయో, మరెంత మంది సోషల్ మీడియా స్టార్స్ కానున్నారో వేచి చూడాల్సిందే అంటున్నారు.