Begin typing your search above and press return to search.

పేదలను కొట్టి.. పెద్దలకు రుణమాఫీ.. రాయపాటికి 1790కోట్ల మాఫీ!

By:  Tupaki Desk   |   29 April 2020 11:45 AM IST
పేదలను కొట్టి.. పెద్దలకు రుణమాఫీ.. రాయపాటికి 1790కోట్ల మాఫీ!
X
లాక్ డౌన్ వచ్చింది. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగాలు పోయాయి. సంపాదన లేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఈఎంఐలు కట్టాల్సిన ప్రజలకు ఆర్బీఐ మూడు నెలలు వాయిదా వేసింది. అయితే దానికి వడ్డీని జోడిస్తోంది. ఈ మూడు నెలల రిలాక్సేషన్ తర్వాత మళ్లీ ఈఎంఐలు ముక్కుపిండి వసూలు చేస్తుంది. వాళ్లకు సంపాదన ఉన్నా పోయినా కట్టాల్సిందే. పేదలను కొట్టే విషయంలో ఇంత కఠినత్వం చూపిన ఆర్బీఐ అదే పెద్దల విషయంలో ఎంత ఉదారత చూపిస్తుందో తాజా సంఘటన నిరూపించింది.

నిజానికి సామాన్యులెవరు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారు. ఎగ్గొట్టిన బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేస్తాయి. కానీ బడా పారిశ్రామికవేత్తల విషయంలో తీసుకున్న రుణాలు కట్టకపోయినా.. మొండి బకాయిలుగా మారినా వారి ఆస్తులను వేలం వేసే ఆలోచనను బ్యాంకులు, ఆర్బీఐ చేయవు. ఈ కార్పొరేట్ కంపెనీ యజమానులు వారి దగ్గర డబ్బులు ఉన్నా కట్టరు కూడా.. కట్టించుకునే ప్రయత్నం కూడా చేయరు. మళ్లీ వారికే బ్యాంకు రుణాలు ఇస్తుంటారు. ఈ దేశంలో పేదలకు.. పెద్దలకు ఉన్న వ్యత్యాసం ఇదీ.. ఎంత దుర్మార్గం ఇదీ..

సాధారణంగా రైతులకు, రైతు రుణాలకు ప్రభుత్వాలు, ఆర్బీఐ రుణమాఫీ చేస్తుంటాయి.కానీ తాజాగా దేశంలో కోట్లు తీసుకొని కట్టని బడా పారిశ్రామికవేత్తల మొండి బకాయిలకు కూడా తాజాగా రుణాలను మాఫీ చేసి ఆర్బీఐ అందరినీ ముక్కునవేలేసుకునేలా చేసింది. ఎంతటి దుర్మార్గమైన చర్య ఇది అని సామాన్యులంతా ప్రశ్నిస్తున్నారు. వారి ఆస్తులు వేలం వేయకుండా.. స్వాధీనం చేసుకోకుండా ఇలా రుణమాఫీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

తాజాగా సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ నుంచి సమాచారం సేకరిస్తే షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ రుణాల రద్దు పొందిన వారిలో దేశంలోనే బ్యాంకులకు ఎగ్గొట్టిన నీరవ్ మోడీ, మొహల్ చోక్సీ, బాబా రాందేవ్, విజయ్ మాల్యా సహా మన తెలుగు ప్రముఖులున్నారు. వారి వివరాలను తెలుసుకుందాం..

+దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేసిన ఆర్బీఐ.. వారి వివరాలివీ..
*మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ బకాయి ఉన్న మొత్తంలో 1790 కోట్లను బ్యాంకులు రద్దు చేశాయి.
*డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి తీసుకున్న రూ.1915 కోట్ల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి.
*వీఎంసీ సిస్టమ్స్ కంపెనీకి 1331కోట్లు
*కోస్టల్ ప్రాజెక్టుకు చెందిన 984కోట్లు
*శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇందూ ప్రాజెక్ట్స్ కు చెందిన రూ.835 కోట్ల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి.

వీళ్లంతా కోటీశ్వరులు.. కోట్లలోనే డీల్ చేస్తారు. ఖరీదైన కార్లలో తిరుగుతారు. అయినా ఆర్బీఐ వీరి నుంచి ఇన్ని వేల కోట్లు వసూలు చేయలేకపోయింది. సామాన్యుడి ఈఎంఐలను మాత్రమే బేషుగ్గా వసూలు చేస్తుంది. డబ్బులు కట్టని రైతుల ఇంటి తలుపులు లాక్కెళ్లే బ్యాంకులు ఇంతటి ఎగవేతదారుల వేల కోట్లను మాత్రం రద్దు చేయడం.. ప్రభుత్వాలు కళ్లుండి గుడ్డిగా చేష్టలుడిగి చూడడంపై సామాన్యుల్లో రక్తం ఉడికిపోతోంది. ఈ దేశంలో సామాన్యులకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయమా అని అందరూ ప్రశ్నిస్తున్నారు.