Begin typing your search above and press return to search.

బ్యాంకుల్లో 'కొత్త' సందడి.. పనివేళలివి!

By:  Tupaki Desk   |   10 Nov 2016 3:36 AM GMT
బ్యాంకుల్లో కొత్త సందడి.. పనివేళలివి!
X
స్టార్ హీరో సినిమా విడుదల సమయంలో థియేటర్ల వద్ద - చేపమందు ప్రసాద సమయంలో హైదరాబాద్ లోని గ్రౌండ్స్ వద్ద - భక్తియాత్రల్లోనూ పుష్కర స్నానాల్లోనూ కనిపించే హడావిడి - భారీ ఎత్తున బందోబస్తు - అదనపు కౌంటర్ల ఏర్పాటు వంటి హడావిడి ఇకపై బ్యాంకుల వద్ద కనిపించబోతుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వినియోగదారుల రద్దీని తట్టుకొనేందుకు బ్యాంకుల వద్ద కనిపిస్తున్న హడావిడి ఇది. బుధవారం మూతపడి సామాన్యుడి జీవితంలో ప్రకంపనలు సృష్టించిన బ్యాంకులు గురువారం తెరచుకోనున్నాయి. పెద్ద నోట్లను మార్పిడి చేసుకొనేందుకు వినియోగదారులు గురువారం నుంచి బ్యాంకులకు భారీగా క్యూ కట్టనున్నారు. దీంతో ఈ హడావిడిని తట్టుకునేందుకు బ్యాంకులు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈమేరకు ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాట్లకు రిక్వస్టులు పెట్టుకున్న బ్యాంకులు... ఆర్బీఐ సూచనల మేర అన్ని బ్యాంకుల బ్రాంచీల్లోనూ అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ పరిస్థితి ఇలానే వారం రొజులకు పైగా ఉండనుండటంతో... దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు రద్దుచేశారు. ఈ మేరకు ఈ నెల 12 - 13వ తేదీల్లో అన్ని బ్యాంకులూ పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. సాదారణంగా... 12వ తేదీ రెండో శనివారం, 13వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంతుంది. కానీ... తాజా పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారుల రద్దీని ఎదుర్కొనేందుకు వీలుగా ఆ రెండు రోజులు బ్యాంకులను తెరచి ఉంచాలని, అదే సమయంలో ప్రధాన బ్యాంకుల పనివేళలనూ పొడిగించాలని సూచించింది. ఈ రూల్స్ ప్రకారం... అన్ని ఎస్‌బీఐ బ్రాంచులు 10వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు పనిచేయనుండగా.. ఐసీఐసీఐ బ్రాంచ్ లు గురు - శుక్రవారాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నాయి.

కాగా, కొత్త నోట్ల కట్టలతో న్యూఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేక వాహనాలు అన్ని రాష్ట్రాలకూ బయలుదేరాయి. పలు నగరాలకు ఈ వాహనాలు హై సెక్యూరిటీ నడుమ బయలుదేరాయి. ఈ వాహనాల ద్వారానే నగరాల్లోని ఆయా బ్యాంకులకు - పోస్ట్ ఆఫీస్‌ లకు కొత్తనోట్లు పంపిస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని బ్యాంకులకు నగదు చేరుకుంది. దీంతో గురువారం బ్యాంకులాన్నీ వినియోగదారులతోనూ, కొత్త నోట్లతోనూ కళకలలాడనున్నాయి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/