Begin typing your search above and press return to search.

టీ సర్కారు సహనానికి బ్యాంకర్ల పరీక్ష

By:  Tupaki Desk   |   16 Sep 2015 6:31 AM GMT
టీ సర్కారు సహనానికి బ్యాంకర్ల పరీక్ష
X
ఎంత ప్రభుత్వంలో భాగమైనా.. బ్యాంకులు బ్యాంకులే. వ్యాపారం మాత్రం చేసే బ్యాంకులు.. కాల ప్రవాహంలో అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీల మాటల్ని లైట్ తీసుకుంటాయి. పవర్ లో ఉన్న వారి మాటను పక్కన పెట్టేస్తాయి. పైకి తలాడించినా.. చేయాల్సిన పనిని చేసుకుంటూ పోతాయి. తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలే దీనికి నిదర్శనం.

సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా అటు ఏపీలోనూ.. ఇటు తెలంగాణలోనూ రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని తెలుగుదేశం.. టీఆర్ ఎస్ లు ప్రకటించాయి. అందుకు తగ్గట్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ సర్కారు రైతుల రుణమాఫీ మీద కచ్ఛితమైన విధివిధానాల్ని పాటిస్తోంది. రైతులకు తాము ప్రకటించిన రుణమాఫీ మొత్తాన్ని నాలుగు భాగాలు చేసి.. ఒక క్రమపద్ధతిలో ఆ మొత్తాన్ని విడుదల చేస్తామని.. ఈ సందర్భంగా రైతుల అప్పులకు సంబంధించి వడ్డీని వారి ఖాతాల్లో వేయొద్దంటూ జీవో జారీ చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన జీవోతో వందలాది కోట్ల రూపాయిల వడ్డీ మిస్ కావటాన్ని బ్యాంకర్లకు నచ్చలేదు. పైకి తలూపినట్లే తలూపేసి.. కామ్ గా తమ దారిన తాము రైతుల ఖాతాల్లో లెక్క ప్రకారం వడ్డీ వేసేస్తున్నారు. దీంతో.. తెలంగాణ సర్కారు చెప్పిన మాటలకు.. జరుగుతున్న దానికి పొంతన లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారేమో రైతుల రుణమాఫీ కింద రెండు దఫాలు మొత్తాన్ని విడుదల చేసినా.. మిగిలిన మొత్తం.. వడ్డీ కలిపి రైతుల ఖాతాల్లో చూపిస్తున్నారు.

ఈ కారణంతోనే.. ఇప్పటికే తెలంగాణ సర్కారు రూ.17వేల కోట్లు చెల్లించినా.. రుణమాఫీకి సంబంధించి రైతుల అకౌంట్లో మాత్రం భారీగానే రుణం కనిపిస్తున్న పరిస్థిది. దీనిపై తెలంగాణ సర్కారు గుర్రుగా ఉంది. తాజాగా మెదక్ జిల్లాలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో మంత్రులు హరీశ్.. పోచారం తదితరులు బ్యాంకర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్యాంకర్లు ప్రభుత్వంలో భాగమన్న విషయాన్ని మర్చిపోకూడదని.. ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత కూడా.. అందుకు భిన్నంగా ఎలా వ్యవహరిస్తారంటూ మండిపడ్డారు. యథావిధిగా బ్యాంకర్లు మౌనంగా ఉండటం.. మరికొందరు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితికి విరుగుడు మరేదైనా ఉందా అనే విషయాన్ని తెలంగాణ సర్కారు దృష్టి సారిస్తే బాగుంటుందేమో.