Begin typing your search above and press return to search.

కరోనా ఐటీ ఉద్యోగి దెబ్బకు బెంగళూరులో జల్లెడ వేసేశారు

By:  Tupaki Desk   |   4 March 2020 4:13 AM GMT
కరోనా ఐటీ ఉద్యోగి దెబ్బకు బెంగళూరులో జల్లెడ వేసేశారు
X
కంపెనీ పని మీద సింగపూర్ వెళ్లి దుబాయ్ మీదుగా విమానంలో బెంగళూరుకు చేరుకున్న హైదరాబాద్ ఐటీ ఇంజనీర్ కు కరోనా వైరస్ సోకిన వైనం తెలిసిందే. దీంతో.. ఒక్కసారిగా ఉలిక్కి పడటంతో పాటు.. అతడి కారణంగా ఎంత మందికి కరోనా వైరస్ ఎఫెక్ట్ అయ్యిందన్న విషయం పై ఆరా మొదలైంది. ఇప్పటికే 80 మందిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వ అధికారులు.. వారికి ప్రత్యేక స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. దుబాయ్ విమానంలో బెంగళూరులో దిగిన ఐటీ ఉద్యోగికి సంబంధించిన వివరాల్ని కర్ణాటక ప్రభుత్వం సేకరించింది. ఇప్పటికే.. సదరు ఉద్యోగికి కాంటాక్ట్ అయిన వారందరిని గుర్తించి.. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ప్రయాణించిన ప్రయాణికుల్లో పన్నెండు మంది కర్నాటక వాసులు ఉన్నారని.. వీరంతా తిరిగి బెంగళూరుకు చేరుకున్నట్లుగా కర్ణాటక మంత్రి కె.సుధాకర్ వెల్లడించారు.

తమకు సమాచారం అందిన వెంటనే.. బస్సులో ప్రయాణించిన పన్నెండు మంది బెంగళూరు వాసుల్ని కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది. వారి వివరాల్ని ట్రాక్ చేసి.. పరీక్షలు నిర్వహించనున్నారు. అదే సమయంలో దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన బాధితుడు.. సదరు ఫ్లైట్ లో కాంటాక్ట్ అయినట్లుగా కొందరిని గుర్తించారు. విమానం పక్క సీట్లోనూ.. వెనుక సీట్లోనూ ప్రయాణించిన వారిని గుర్తించి.. వారికి కూడా ముందస్తుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అదే సమయం లో బెంగళూరులోని ఐటీ కంపెనీ లో పని చేసిన సదరు యువకుడి ఆఫీసును సైతం అధికారులు జల్లెడ పడుతున్నారు. అక్కడి ఉద్యోగులకు ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా సదరు ఉద్యోగి నివాసం ఉండే అపార్ట్ మెంట్ లో మొత్తం 97 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిల్లోని వారికి ఏమైనా వైరస్ ప్రభావానికి గురయ్యారా? అన్న పరీక్షల్ని చేపట్టారు. మొత్తంగా హైదరాబాద్ ఐటీ ఉద్యోగి దెబ్బకు భాగ్యనగరి మాత్రమే కాదు.. బెంగళూరు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.