Begin typing your search above and press return to search.

న్యూఇయ‌ర్ వేళ బెంగ‌ళూరులో తాగినోళ్ల‌కు తాగినంత‌?

By:  Tupaki Desk   |   29 Dec 2017 11:36 AM GMT
న్యూఇయ‌ర్ వేళ బెంగ‌ళూరులో తాగినోళ్ల‌కు తాగినంత‌?
X
చ‌దివినంత‌నే మ‌త్తు పుట్టించే ఈ మాట‌ గార్డెన్ సిటీలోని ప‌లు బార్లు.. ప‌బ్బులు.. రెస్టారెంట్లు చెబుతున్నాయి. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రెస్టారెంట్లు.. ప‌బ్బుల్ని ఎప్ప‌టి మాదిరి కాకుండా.. ఎక్కువ స‌మ‌యంలో తెరిచి ఉంచేలా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా డిసెంబ‌రు 31న ఉండే సంద‌డి.. హ‌డావుడి అంతా ఇంతా కాదు. పెద్ద ఎత్తున వేడుక‌లు జ‌రుపుకోవ‌టానికి వీలుగా బార్లు.. రెస్టారెంట్లు.. ప‌బ్ ల క్లోజింగ్ స‌మ‌యాన్ని అర్థ‌రాత్రి రెండు గంట‌ల వ‌ర‌కూ పొడిగిస్తూ క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త ఏడాది నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల సంద‌ర్భంగా కొంద‌రు మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు చోటు చేసుకోవ‌టం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగ‌ళూరు మ‌హా న‌గ‌రంలో చోటు చేసుకున్న లైంగిక వేధింపులు సిటీ ప్ర‌తిస్ఠ‌ను దెబ్బ తీసేలా చేశాయి. ఇలాంటివేళ‌.. భ‌ద్ర‌తాప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సింది పోయి.. బార్ల‌కు బార్లా త‌లుపులు తీసిన‌ట్లుగా అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత కూడా తెరుచుకునే అవ‌కాశం ఇవ్వ‌టం స‌రికాద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

అయితే.. గ‌తంలో జ‌రిగిన ఉదంతాల్ని సాకుగా చూపించి అన‌వ‌స‌ర‌మైన ఆంక్ష‌లు విధించ‌టం స‌రికాద‌న్న వాద‌న‌ను వినిపిస్తున్న వాళ్లు లేక‌పోలేరు. గ‌త అనుభ‌వాల్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని చెబుతున్నారు. దీనికి నిద‌ర్శ‌నంగా బార్లు.. ప‌బ్బుల్లో స్త్రీ.. పురుష‌/ల‌కు ప్ర‌త్యేక గ‌దుల్ని కేటాయించాల‌న్న నిబంధ‌న‌ను పెట్టిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. పిల్ల‌ల‌తో వ‌చ్చే త‌ల్లుల‌కు రిజ‌ర్వ్ డ్ స్థ‌లాన్ని కేటాయించాల‌ని కూడా బెంగ‌ళూరు పోలీసులు స్ప‌ష్టం చేస్తున్నారు.

దీంతో.. పోలీసుల ఆదేశాల మేర‌కు డిసెంబ‌రు 31 రాత్రి వేళ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని బార్లు.. ప‌బ్బులు.. రెస్టారెంట్ల‌లో ప్ర‌త్యేక ఆఫ‌ర్ కింద తాగినోళ్ల‌కు తాగినంత మ‌ద్యాన్ని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. అయితే.. ఇవ‌న్నీ ప్ర‌త్యేక ప్యాకేజీల పేరుతో ఉంటాయ‌ని.. అలాంటి వారికి మాత్ర‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్ ఉంటుద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు.. డిసెంబ‌రు 31 రాత్రి ప‌న్నెండు గంట‌ల‌కే సంబ‌రాలు ముగిసిపోవాల‌ని.. త‌ర్వాత కానీ కొన‌సాగితే బాగోద‌ని కొన్ని హిందుత్వ సంస్థ‌లు ప్ర‌క‌టించ‌టం గ‌మ‌నార్హం. ఓవైపు తాగినోళ్ల‌కు తాగినంత ఆఫ‌ర్.. మ‌రోవైపు అర్థ‌రాత్రి 12 గంట‌ల త‌ర్వాత నో వేడుక‌లు అని తేల్చేస్తున్న వేళ‌.. ఆ రోజు ఏం జ‌రుగుతుందోన‌న్న సందేహం ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది.