Begin typing your search above and press return to search.

పవన్ ను బండ్ల గణేశ్ అంత మాట అనేశారా?

By:  Tupaki Desk   |   12 Sept 2019 10:28 AM IST
పవన్ ను బండ్ల గణేశ్ అంత మాట అనేశారా?
X
కొందరు పెదవి విప్పితే వార్తగా మారుతుంది. సంచలనమవుతుంది. మరికొన్నిసార్లు వివాదంగా మారి.. ఆ ఇష్యూ అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది. కాస్త ఎటకారం.. మరికాస్త బోల్డ్ నెస్ తో మనసుకు తోచినట్లుగా మాట్లాడే సినీ పరిశ్రమకు చెందిన వారిలో బండ్ల గణేశ్ ఒకరు.

నటుడిగా.. నిర్మాతగా సుపరిచితుడైన ఆయన గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికలకు కాస్త ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి హడావుడి చేసిన ఆయన.. దారుణ పరాజయం తర్వాత కామ్ కావటం తెలిసిందే. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పెదవి విప్పారు.

తాజాగా ఏపీలో నడుస్తున్న పల్నాడ్ ఎపిసోడ్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాడు గొడవతో ఏపీ పరువు గంగలో కలిసిందన్న ఆయన.. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ మరో బిహార్ గా మారిందన్నారు. ఇప్పటికే పలుమార్లు చచ్చామన్న ఆయన.. రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలన్న అంశంపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

మద్రాస్ అని కొన్నాళ్లు.. కర్నూల్ అని మరికొన్నాళ్లు.. హైదరాబాద్ అంటూ మాటలు పడ్డామని.. ఇప్పట్లో ఎన్నికలు లేని విషయాన్ని గుర్తించి ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్.. విపక్షం టీడీపీలు వ్యవహరించాలన్నారు. కలిసి పని చేయటం రాష్ట్రానికి చాలామందిన్నారు.

ఈ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ జెండా లేని.. ఎజెండా లేని నాయకులు కొంతకాలం రెస్ట్ తీసుకుంటే మంచిదన్న బండ్ల మాట జనసేన అధినేత పవన్ ను ఉద్దేశించి అన్నట్లుగా చెబుతన్నారు. జనాల్ని కాసేపు మనశ్శాంతిగా ఉండనివ్వాలన్న బండ్ల గణేశ్.. మీ కన్ఫ్యూజన్ లో జనం ఏం చేయాలో.. ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదన్నారు.

అమరావతి ఉంటుందో.. ఊడుతుందో అర్థం కాక జనం జుట్టు పీక్కుంటున్నారన్న ఆయన.. దగాపడ్డ ఏపీ ప్రజలు నాయకుల్ని నమ్మొద్దన్నారు. ఇన్ని మాటలు చెప్పిన తాను సైతం ఏపీ ప్రజలకు ఏమీ సహాయం చేయలేనని.. మనల్ని ఆ భగవంతుడే కాపాడాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరికి అనుకూలం.. మరొకరికి ప్రతికూలం అన్నట్లు కాకుండా అందరికి కలిపి ఏసుకున్న బండ్ల గణేశ్ మాటలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.