Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లోకి గులాబీ ఎమ్మెల్యేలట..బండ్ల కామెడీ..

By:  Tupaki Desk   |   22 Nov 2018 10:01 AM IST
కాంగ్రెస్ లోకి గులాబీ ఎమ్మెల్యేలట..బండ్ల కామెడీ..
X
బండ్ల గణేష్.. సినిమాల్లో కామెడీ చేసి బయటకు వచ్చి సీరియస్ పాలిటీషియన్ అవుదామని కలలు గన్నాడు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ లో చేరితే నట్టేట ముంచింది. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా అటు కాంగ్రెస్ ను వదలలేక.. ఇటు ఆ పార్టీ చేసిన మోసంతో అందులో ఉండలేక అరువు తెచ్చిన నవ్వుతో మీడియా ముందుకొచ్చాడు. కాంగ్రెస్ మోసాన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనిపించింది.

బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరాక ఆశించిన రాజేంద్రనగర్ సీటును మహాకూటమిలో భాగంగా టీడీపీకి అప్పగించింది. దీంతో ‘బండ్ల గణేష్ అనే నేను’ అంటూ ఎమ్మెల్యేగా ముందే ప్రమాణం చేసిన ఆయన ఆశలు అడియాసలయ్యాయి. టికెట్ దక్కని తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పై ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా పరిస్థితుల ప్రభావం అంటూ సర్ధి చెప్పుకొచ్చాడు..

మహాకూటమి పొత్తుల్లో భాగంగా తన సీటు రాజేంద్రనగర్ టీడీపీకి ఇచ్చారని.. అందుకే తనకు సీటు ఇవ్వలేదని బండ్ల గణేష్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ తన భార్య సీటును వదలుకునేందుకు సిద్ధమయ్యారని.. కోదండ రాం కూటమి కోసం త్యాగం చేశారని.. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న మర్రి శశిధర్ రెడ్డికే టికెట్ దక్కలేదని.. 3 నెలల్లోనే కాంగ్రెస్ లో చేరిన తనకు టికెట్ దక్కకపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ డిసెంబర్ 11న అధికారంలోకి వస్తుందని తనకు ఎమ్మెల్సీనో.. మరేదైనా పదవి దక్కుతుందని బండ్ల ఆశాభావం వ్యక్తం చేశారు..

ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర రావు కాంగ్రెస్ లో చేరారని.. త్వరలోనే డిసెంబర్ 11న గెలవగానే కాంగ్రెస్ లో చేరేందుకు 11 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు..4 ఎంపీలు లైన్లో ఉన్నారని.. టీఆర్ ఎస్ కబంధ హస్తాల్లోంచి బయటకు వస్తామని తమతో టచ్ లోకి వచ్చి మొర పెట్టుకుంటున్నారని బండ్ల గణేష్ సంచలన వ్యాక్యలు చేశారు. మరి ఎవరా 11 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. 4 ఎంపీలు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బండ్ల కామెడీగా ఇలా అన్నాడా.? లేక ఇది సీరియస్ విషయమా అనేది రాజకీయంగా చర్చ జరుగుతోంది.