Begin typing your search above and press return to search.

బాబు గారు.. ప్లీజ్ ఆ సీటు అడగొద్దు: బండ్ల

By:  Tupaki Desk   |   28 Oct 2018 3:18 PM IST
బాబు గారు.. ప్లీజ్ ఆ సీటు అడగొద్దు: బండ్ల
X
ఢిల్లీ పర్యటనలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రాంగం నడుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబు వద్దకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గజ్వేల్ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, సీనియర్ నేత డీ శ్రీనివాస్ శనివారం కలిశారు. తాజాగా నిర్మాత కం కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ టీడీపీ అధినేత ను కలిశారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ అసెంబ్లీ సీటును తాను కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆశిస్తున్నానని.. తెలుగుదేశం పార్టీ నేతలు పట్టుబట్టకుండా చూడాలని బండ్ల గణేష్ తెలుగుదేశం పార్టీ అధినేతను కోరినట్టు సమాచారం.

అప్పట్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. షాద్ నగర్ లో ఆయన పౌల్ట్రీ ఫారాలు ఎక్కువగా ఉండడం.. పరిసర గ్రామాల ప్రజలతో గణేష్ కు పరిచయం ఉండడంతో ఇక్కడి నుంచే పోటీచేస్తారని ఆశించారు. షాద్ నగర్ లో 2014లో టీఆర్ఎస్ నుంచి అంజయ్య యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డిపై గెలిచారు. ఈసారి వీళ్లిద్దరే బరిలో ఉన్నారు. దీంతో బండ్ల గణేష్ కు షాద్ నగర్ సీటు కష్టమైంది. అందుకే తాజాగా చంద్రబాబును కలిసి రాజేంద్రనగర్ సీటును కోరవద్దని.. ఆ సీటునే కావాలని అడగడం విశేషం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బండ్ల గణేష్ కన్ను ఇప్పుడు రాజేంద్రనగర్ పై పడడానికి కారణముంది. 2014 ఎన్నికల్లో రాజేంద్రనగర్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ గెలుపొందారు. ఆయన ఆ తర్వాత కారెక్కి టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ఇక్కడ టీడీపీకి అభ్యర్థి కరువయ్యాడు. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్-టీడీపీ మహాకూటమి అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని బండ్ల కోరుతున్నారు. మరి బాబు అంగీకరిస్తారా..? కాంగ్రెస్ కరుణిస్తుందా అన్నది వేచి చూడాలి.