Begin typing your search above and press return to search.

బండ్ల గణేష్ కితకితలు ఎక్కువ అయ్యాయా...?

By:  Tupaki Desk   |   30 Oct 2022 2:10 PM IST
బండ్ల గణేష్ కితకితలు ఎక్కువ అయ్యాయా...?
X
కాకపొతే లేకపోతే మరేంటిది ఆయన ఎపుడు సీరియస్ పొలిటీషియన్ అయ్యారు. ఎపుడు పోటీ చేశారు. ఎపుడు ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. మరెపుడు ఆయన రాజకీయ ప్రత్యర్ధులతో మాటల సమరం సాగించారు. ఇవన్నీ గణేష్ ఇచ్చిన ఒకే ఒక్క బోల్డ్ స్టేట్మెంట్ తో ఎదురైన ప్రశ్నలు. ఇంతకీ గణేష్ ఈ వీకెండ్ సెన్సేషన్ అన్నట్లుగా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను రాజకీయాలకు గుడ్ బై కొడుతున్నాట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

తాను ఏ రాజకీయ పార్టీకి శత్రువు కానీ మిత్రుడు కానీ కానే కాదని తేల్చేశారు. అదే విధంగా చూస్తే రాజకీయాల్లో ఉన్న వారు అందరూ తనకు ఆత్మీయులే అని మరో మాట అన్నారు. తాను గతంలో ఎవరినైనా తెలిసో తెలియకో మాట అంటే దానికి వారు బాధపడితే తనను మన్నించాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ నేతగా కొనసాగిన గణేష్ ఇపుడు ఆ చిన్నపాటి బంధం కూడా వదులుకున్నారు అన్న మాట.

తనకు ఉమ్మడి కుటుంబం, వ్యాపారాలు, పిల్లల బాధ్యతలు ఉండడం వల్ల రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లుగా చెప్పారు. ఇదంతా చూస్తూంటే సీరియస్ గా ఏళ్ల కొలదీ పాలిటిక్స్ చేస్తూ వస్తున్న ఒక సీనియర్ నేత తన రాజీనామా పత్రాన్ని రాసినట్లు లేదూ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నిజానికి గణేష్ ని అంతా సినిమా నిర్మాతగా చూస్తారు. దానికి మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడిగా చూస్తారు. ఇంకా చెప్పాలీ అంటే కొన్నేళ్ల క్రితం ఆయన కమెడియన్ కాబట్టి ఆ పాత్రలను కూడా చూసి అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు.

కానీ సడెన్ గా గణేష్ తన రాజకీయ అవతారాన్ని చాలించేశాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి పారేశారు. దాంతో ఈయనెపుడు పాలిటిక్స్ కి వెళ్లాడురా బాబూ అని ప్రతీ వారూ బుర్రలు గోక్కునే సీన్ ఉంది. నిజం చెప్పాలీ అంటే గణేష్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ తరఫున ఆ టైం లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ కూడా ఆశించారు. అయితే ఆయనకు దక్కలేదు. దాంతో కొంత నిరాశ పడ్డారు.

అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని లేకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని గణేష్ విచిత్రమైన సవాల్ చేశారు. కానీ అది జరగలేదు, ఇదీ జరగలేదు, దాంతో కొన్నాళ్ళ పాటు ఆయన బ్లేడ్ గణేష్ గా అందరికీ గుర్తున్నరు. ఒక ఆట ఆడుకున్నారు. ఇదీ ఆయన పొలిటికల్ ఫ్లాష్ బ్లాక్. అంతటితో ఆ కధ సమాప్తం అయింది. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో కూడా కీలకంగా లేరు.

కానీ ఇపుడు పాలిటిక్స్ కి రాం రాం అంటూంటేనే గణేష్ కితకితలు పెడుతున్నారా అని సెటైర్లు పడుతున్నాయి. గణేష్ రాజకీయ నాయకుడు ఎపుడు అయ్యారు, ఎక్కడ తిరిగారు, ఎవరిని గెలిపించారు అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే గణేష్ వెండితెర మీద మంచి కమెడియన్ కదా. తన మార్క్ హాస్యం ఇలా పండించారు అనుకోవాలేమో.